బీబీసీ కార్యాలయాల్లో మూడో రోజూ సోదాలు

  • విరామంలేకుండా 45 గంటల నుంచి అధికారుల సర్వే
  • 10 మంది సీనియర్ ఉద్యోగులు కూడా వారితోనే
  • ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమన్న ఐటీ శాఖ
బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కు చెందిన ముంబై, ఢిల్లీలోని కార్యాలయాల్లో ఐటీ సోదాలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మొదలైన సోదాలు.. 45 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల సందర్భంగా సంస్థలోని సీనియర్ అధికారులు కూడా లోపలే ఉండిపోయారు. వారు కూడా ఇంటికి వెళ్లలేదని, సాధారణ ఉద్యోగులు మాత్రం తమ రోజువారీ విధులు నిర్వహించుకుని వెళ్లిపోతున్నారని సమాచారం.

అధికారులు, ఉద్యోగుల నుంచి సమాచారం సేకరిస్తూ, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల నుంచి సమాచారం కాపీ చేసుకుంటూ ఐటీ శాఖ అధికారులు బిజిబిజీగా ఉన్నారు. పన్ను చెల్లింపు, నగదు తరలింపునకు సంబంధించి బీబీసీ వెల్లడించిన వివరాలు, చూపించిన ఖర్చులపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ టాక్సేషన్ తో పాటు నిధుల బదిలీలకు సంబంధించిన సమాచారం కోసం అధికారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సోదాలు ఎప్పటికి ముగుస్తాయనే ప్రశ్నకు ఐటీ శాఖ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. సోదాల ముగింపు వ్యవహారం అందులో పాల్గొన్న ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొంది. ఆధారాలను సేకరించడానికి ఒక్కోసారి ఎక్కువ టైం పట్టొచ్చు, మరోసారి త్వరగా పూర్తవ్వచ్చు అని తెలిపారు.


More Telugu News