బీసీసీఐ ముందు ఐసీసీ ఏమీ చేయలేదు.. పాకిస్థాన్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: షాహిద్ అఫ్రిదీ

  • ఆసియా కప్ ఆడటం కోసం పాకిస్థాన్ కు భారత్ రాదన్న అఫ్రిదీ
  • ప్రపంచ కప్ కోసం ఇండియాకు పాక్ వెళ్తుందని భావిస్తున్నట్టు వ్యాఖ్య
  • ఆర్థికంగా బలమైన బీసీసీఐని కాదని ఐసీసీ ఏమీ చేయలేదన్న అఫ్రిదీ
ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ లో జరగనుంది. అయితే పాకిస్థాన్ లో ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు ఈ అంశంపై మాట్లాడుతూ... పాక్ లో భారత్ ఆడకపోతే, ఇండియాలో జరగబోయే ప్రపంచకప్ లో తాము ఆడబోమని హెచ్చరించింది. అయినా భారత్ ఏమాత్రం తగ్గలేదు. ఇండియాలో మీరు ఆడినా, ఆడకపోయినా మాకు అనవసరం... మేమైతే పాక్ లో అడుగుపెట్టేదేలేదని కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో, ఆసియా కప్ వేదికను యూఏఈకి ఐసీసీ మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరోవైపు ఈ అంశంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ స్పందిస్తూ... బీసీసీఐని కాదని ఏమీ చేయలేని పరిస్థితిలో ఐసీసీ ఉందని చెప్పాడు. ఎవరైనా సరే తమ కాళ్ల మీద పటిష్ఠంగా నిలబడలేకపోతే... వారు బలమైన నిర్ణయాలను కూడా తీసుకోలేరని అన్నాడు. బీసీసీఐకి ఇదే బలమని... వారు ఆర్థికంగా, ఆటపరంగా చాలా బలంగా మారిపోయారని చెప్పాడు. అందుకే భారత్ అభిప్రాయాన్ని ఐసీసీ పక్కన పెట్టలేదని అన్నాడు. పాకిస్థాన్ లో భారత జట్టు పర్యటిస్తుందని తాను భావించడం లేదని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో ఇండియాలో జరిగే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడుతుందనేది కూడా తన భావన అని చెప్పాడు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడాలనే తాను చెపుతానని అన్నాడు. 

ప్రస్తుత సమస్యను పరిష్కరించడంలో ఐసీసీదే కీలక పాత్ర అయినప్పటికీ... బీసీసీఐ ముందు ఐసీసీ ఏమీ చేయలేదని అఫ్రిదీ చెప్పాడు. పాకిస్థాన్ విషయానికి వస్తే... బోర్డు ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన ప్రణాళికను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతామని చెప్పాడు.


More Telugu News