అమెరికాలోని పనామాలో బస్సు బోల్తా.. 39 మంది దుర్మరణం

  • ప్రమాద సమయంలో బస్సులో 66 మంది వలసదారులు
  • మరో 20 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
  • మరో ఏడుగురి జాడ తెలియట్లేదన్న అధికారులు
దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని శరణార్థుల శిబిరానికి తరలిస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దీంతో అందులోని 39 మంది వలసదారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. అమెరికాలోని పనామాలో జరిగిందీ ఘోర ప్రమాదం. ఘాట్ రోడ్ లో వెళ్తుండగా బస్సు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.

కొలంబియా నుంచి 66 మంది అక్రమంగా సరిహద్దు దాటి పనామాలో అడుగుపెట్టారు. వారంతా బార్డర్ దగ్గర విధుల్లో ఉన్న సైనికులకు పట్టుబడ్డారు. దీంతో వారందరినీ శరణార్థుల శిబిరానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం బస్సును ఏర్పాటు చేశారు. బస్సులో వారిని గౌలాకా శరణార్థుల శిబిరానికి తరలిస్తుండగా.. ఘాట్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.

ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదం విషయం తెలిసి పోలీసులు, ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే 39 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. బస్సులోని 20 మంది గాయపడగా.. మరో ఏడుగురు పారిపోయారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించామని, పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది వెనిజులాకు చెందిన వారేనని అధికారులు తెలిపారు.


More Telugu News