ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధర పెంపునకు ప్రభుత్వం రెడీ!

  • గత మూడేళ్లలో రెండుసార్లు పెంపు
  • తాజాగా బేసిక్ ప్లాన్‌పై మరో రూ. 49 వడ్డింపు
  • వినియోగదారులపై ఏటా రూ. 75 లక్షల భారం పడే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (ఏపీ ఫైబర్ నెట్) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్‌ ఇంటర్ నెట్ సేవలను అందిస్తున్న ప్రభుత్వం బేసిక్ ప్లాన్ ధరను పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత మూడేళ్లలో ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా మరోమారు అలాంటి నిర్ణయమే తీసుకున్నట్టు సమాచారం.

 ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్యాక్ ధర ప్రస్తుతం రూ. 350 ఉండగా దానిని రూ. 399 చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ చార్జీల పెంపుతో ప్రజలపై నెలకు రూ. 6.25 లక్షల చొప్పున ఏడాదికి రూ. 75 లక్షల భారం పడనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో చార్జీల పెంపు తీర్మానాన్ని ఆమోదం కోసం ఉంచాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. 

ఏపీ ఫైబర్ నెటల్ ట్రిపుల్ ప్లే సర్వీసు బాక్సుల ద్వారా వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్‌లైన్ సేవలను ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ సంస్థ అందిస్తోంది. బేసిక్ ప్లాన్‌తో 200కుపైగా చానళ్లు, 15 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత వేగం 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.


More Telugu News