రుతు సమయంలో సెలవులు కావాలంటూ పిటిషన్.. 24న విచారణ

  • అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలను ఆదేశించాలని కోరిన పిటిషనర్
  • జొమాటో, బైజూస్, స్విగ్గీ తదితర సంస్థలు ఇప్పటికే ఇస్తున్నాయని ప్రస్తావన
  • చైనా, జపాన్, తైవాన్, బ్రిటన్ తదితర దేశాల్లోనూ ఉన్నట్టు వెల్లడి
విద్యార్థినులు, ఉద్యోగినులకు రుతుక్రమం సమయంలో సెలవులు మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఈ నెల 24న విచారణ నిర్వహించేందుకు అత్యున్నత న్యాయస్థానం నేడు అంగీకరించింది. రుతు సమయంలో నొప్పుల నుంచి ఉపశమనంగా సెలవులు మంజూరు చేయాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.

మేటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ లోని సెక్షన్ 14 ను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ కోర్టుని అభ్యర్థించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు న్యాయవాది విషాల్ తివారీ ఈ పిటిషన్ ను ప్రస్తావించారు. దీంతో దీనిపై విచారణకు ధర్మాసనం అంగీకరించింది. జొమాటో, బైజూస్, స్విగ్గీ, ఇవీపనన్ అనే సంస్థలు వేతనంతో కూడిన పీరియడ్ సెలవులు ఇస్తున్నట్టు పిటిషనర్ తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. బ్రిటన్, చైనా, జపాన్, తైవాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, స్పెయిన్, జాంబియా దేశాలు ఇప్పటికే మెనుస్ట్రువల్ లీవ్ ను ఇస్తున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News