బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల అన్వేషణ దేని కోసం?

  • పన్నుల ఎగవేత కోణాన్ని వెలికితీసే ప్రయత్నం
  • షెల్ కంపెనీ, ఫండ్ ట్రాన్స్ ఫర్ పదాలతో సమాచార శోధన
  • స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ క్షుణ్ణంగా పరిశీలన
బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుంచి చేస్తున్న సర్వే కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఏక కాలంలో నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈ సర్వే జరుగుతోంది. ఇందులో భాగంగా కార్యాలయాల్లోని అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్, డేటాను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించిన మొబైల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. 

ఇప్పుడు స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో అధికారులు ఉన్నారు. అంతర్జాతీయ పన్ను, బీబీసీ సబ్సిడరీల బదిలీ ధరపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా షెల్ కంపెనీ, ఫండ్ ట్రాన్స్ ఫర్, ఫారీన్ ట్రాన్స్ ఫర్ అనే కీవర్డ్స్ తో వారు తమ వద్దనున్న పరికరాల నుంచి డేటాను పొందే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పన్నుల ఎగవేత కోణాన్ని వెలికితీసే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆదాయపన్ను శాఖ గతంలోనూ బీబీసీకి నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా తన లాభాలను బీబీసీ గణనీయంగా విదేశాలకు మళ్లించినట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.  ఇది సర్వే మాత్రమేనని, ఫోన్లను తిరిగి ఉద్యోగులకు ఇచ్చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు.


More Telugu News