ఆందోళన వేధిస్తుంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే

  • జీవనశైలి, పని ఒత్తిడితో తెలియని ఆందోళన
  • కాఫీ, నూనెలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తో ఈ ఆందోళన మరింత అధికం
  • తమ వంటికి సరిపడని వాటికి దూరంగా ఉండాలి
మన చుట్టూ ఉన్న వారిలో చాలా మందిలో ఆందోళన ఉంటుంది. తమలో ఆందోళన ఉందని 99 శాతం మంది గుర్తించలేరు. పని ఒత్తిడి ఎక్కువైన వారిలో అంతర్గతంగా ఆందోళన ఎక్కువే ఉంటుంది. అందుకే యోగా, ప్రాణాయామం లేదా మెడిటేషన్ అనేవి నేటి జీవనానికి ఎంతో అవసరం. ఆందోళన తగ్గించుకునేందుకు సహజ పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి. లేదంటే వైద్యుల సాయం తీసుకోవచ్చు. అయితే, ఈ తరహా సమస్యతో ఉన్నవారు ఆందోళనను మరింత పెంచే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. 

కాఫీ
కాఫీలో ఉండే కెఫైన్ కొందరిలో ఆందోళనను పెంచుతుంది. అందరికీ అని కాదు కానీ, కొద్ది మంది శరీర తత్వానికి కాఫీ సరిపడదు. కాఫీ తాగిన తర్వాత అసౌకర్యంగా, ఆదుర్దాగా అనిపిస్తుంటే అలాంటి వారు దాన్ని తీసుకోకపోవడమే మంచిది. 

పారిశ్రామిక నూనెలు
పరిశ్రమల్లో తయారయ్యే నూనెలతోనూ ఆందోళన పెరిగిపోతుంది. కార్న్, గ్రేప్ సీడ్, సోయాబీన్, సన్ ఫ్లవర్, పామాయిల్ నుంచి ఉత్పత్తి చేసే నూనెల్లో ఒమెగా ఫ్యాటీ 6 యాసిడ్స్ ఎక్కువ. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఒమెగా ఫ్యాటీ 6 యాసిడ్స్ పెరిగి ఇన్ ఫ్లమేషన్ కు కారణమవుతుంది. కనుక ఈ నూనెలను తగ్గించుకోవడం అవసరం. గానుగ పట్టించిన పల్లీ, నువ్వులు, అవిశె నూనెలు వాడుకోవచ్చు.

ప్రాసెస్డ్ ఫుడ్స్
ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడానికి రుచిగా ఉంటాయేమో కానీ, ఎన్నో అనారోగ్యాలకు ఇవి దగ్గరి దారి వంటివి. ఆందోళనను కూడా పెంచుతాయి. వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్ ఫ్లమేషన్ పెరిగిపోతుంది. అది ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది.

రిఫైన్డ్ షుగర్
రిఫైన్డ్ చక్కెరతో మంచి కంటే చెడే ఎక్కువ. కేక్ లు, కుకీలు, కెచప్ లు, సలాడ్, పాస్తా, డోనట్, ఐస్ క్రీమ్ చెప్పుకోవడానికి ఇలాంటి జాబితా పెద్దగానే ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆందోళన ఉన్న వారికి మరింత పెరుగుతుంది.

ఆల్కహాల్
ఇక ఆల్కహాల్ తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. తీసుకున్నప్పుడు ఆ మత్తు మీద తెలియదు కానీ, తర్వాతి రోజు గమనిస్తే తేడా ఏంటో గుర్తించొచ్చు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాతి రోజు అసౌకర్యంగా ఉందంటే అది మీకు సరిపడదని అర్థం చేసుకుని దూరంగా ఉండాలి.


More Telugu News