ఏబీ వెంకటేశ్వరరావు అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇదే!

  • అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం
  • డిస్మిస్ చేసేందుకు నిరాకరణ
  • శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి సూచన
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి మిశ్రమ ఫలితాలు లభించాయి. ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించింది. 

ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాజాగా తిరస్కరించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని స్పష్టం చేసింది. 

అయితే, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని, రిటైర్ అయ్యే వరకు లభించే ఇంక్రిమెంట్లను రద్దు చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏపీ సీఎస్ కు లేఖ రాసింది. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

గత ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనను విధుల నుంచి తొలగించింది. దాంతో ఆయన న్యాయపోరాటం చేశారు. 

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గతేడాది సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ పోస్టింగ్ ఇచ్చిన 15 రోజులకే ఆయనను మరోమారు సస్పెండ్ చేశారు. అవినీతి కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారన్న అభియోగాలతో ప్రభుత్వం ఆ మేరకు సస్పెన్షన్ వేటు వేసింది.


More Telugu News