రష్యా-ఉక్రెయిన్ వివాదంలో భారత్ తటస్థంగా ఉంది... మరి పాకిస్థాన్...?: ఇమ్రాన్ ఖాన్

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్
  • రష్యా వైఖరిని ఖండించాలని ఇమ్రాన్ ను కోరిన జనరల్ బాజ్వా
  • భారత్ ను ఉదహరించిన ఇమ్రాన్ 
  • పాకిస్థాన్ కూడా తటస్థంగా ఉండాలని కోరుకున్నానని వెల్లడి
పాకిస్ధాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తమ దేశ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందని, మరి పాకిస్థాన్ వైఖరి ఏంటని ప్రశ్నించారు. 

తాను ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చానని, అయితే, అప్పటి సైనిక జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించాలని కోరాడని, తాను అందుకు అంగీకరించలేదని ఇమ్రాన్ ఖాన్  వెల్లడించారు. భారత్ ఈ విషయంలో మధ్యస్థంగా ఉంది... పాకిస్థాన్ కూడా అలాగే తటస్థంగా వ్యవహరించాలని ఆనాడు సైనిక జనరల్ తో చెప్పానని గుర్తుచేసుకున్నారు. అమెరికాను సంతృప్తి పరిచేందుకే రష్యా వైఖరిని ఖండించాలని జనరల్ బాజ్వా తనను కోరాడని ఇమ్రాన్ వివరించారు. 

ఆ తర్వాత, అమెరికా మెప్పు పొందేందుకు జనరల్ బాజ్వా ఓ అడుగు ముందుకేసి ఓ సైనిక సదస్సులో మాట్లాడుతూ, ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రకటన చేశాడని ఆరోపించారు. అంతేకాదు, తాను ప్రధాన పదవి నుంచి దిగిపోవడానికి కుట్ర చేసిన వారిలో జనరల్ బాజ్వా కీలక సూత్రధారి అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.


More Telugu News