పర్యాటక అభివృద్ధి కింద ఏపీకి రూ.120 కోట్లు మంజూరు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • అమరావతిలో బుద్ధ ధ్యానవనం ప్రారంభం
  • కార్యక్రమానికి హాజరైన ఏపీ మంత్రి రోజా తదితరులు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు ఏపీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి అమరావతిలో బుద్ధ ధ్యానవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం మంత్రి రోజా, రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రూ.7 వేల కోట్లతో 'స్వదేశీ దర్శన్' పేరుతో దేశవ్యాప్తంగా టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. 'ప్రసాద్' పథకం కింద రూ.5 వేల కోట్లతో ఏపీలోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వివరించారు.

గండికోట, లంబసింగిలో మ్యూజియాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పర్యాటక అభివృద్ధి కింద ఏపీకి రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.27.07 కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల్లో యూత్ టూరిజం క్లబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి రోజా మాట్లాడుతూ, రాష్ట్రంలోని బౌద్ధారామాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పిల్లలకు చరిత్ర, సంస్కృతి గురించి తెలియజేయాలని సూచించారు. 'ప్రసాద్' పథకం ద్వారా సింహాచలం, అన్నవరం ఆలయాల అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. 'స్వదేశీ దర్శన్' పథకం ద్వారా గండికోట, లంబసింగి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని రోజా పేర్కొన్నారు.


More Telugu News