దాచేది లేదు.. భయపడేది లేదు: అదానీ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి

  • ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరిందన్న అమిత్ షా
  • దీనిపై మంత్రిగా తాను మాట్లాడడం సరికాదని వ్యాఖ్య
  • గౌతమ్ అదానీ గ్రూప్ అంశంపై తొలిసారి స్పందన
అదానీ గ్రూప్ నకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూటిగా బదులిచ్చారు. బీజేపీ ఈ విషయంలో ఏమీ దాచడం లేదని, దేనికీ భయపడడం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయ విచారణ పరిధిలో ఉన్నందున తాను మాట్లాడడం సరికాదన్నారు. ఆశ్రిత పక్షపాతం అంటూ ప్రతిపక్షాలు బీజేపీ సర్కారును ఎండగడుతున్న విషయం తెలిసిందే.

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే షార్ట్ సెల్లర్ అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో, షేరు ధరల్లో అవకతవకలు ఉన్నాయంటూ జనవరి చివర్లో ఓ నివేదికను విడుదల చేయడం తెలిసిందే. ఆ తర్వాత అదానీ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను చవిచూశాయి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఈ అంశంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. పార్లమెంటులో చర్చకు పట్టు బట్టడం తెలిసిందే. 

ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లోపల, బయట ఖండిస్తూ మాట్లాడారు. ఈ అంశాన్ని నియంత్రణ సంస్థలే చూసుకుంటాయని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కూడా ప్రతిపక్షాల ఆరోపణలు అర్థం లేనివిగా కొట్టిపడేశారు. అదానీ అంశానికి సంబంధించి రెండు ప్రజాహిత వ్యాజ్యాలు సుప్రీంకోర్టులో దాఖలు కావడం తెలిసిందే. 

‘‘ఈ అంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. ఒక మంత్రిగా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లిన అంశంపై మాట్లాడడం సరికాదు. కానీ, ఈ అంశంలో బీజేపీ దాచడానికి ఏమీ లేదు. అలాగే, దేనికీ భయపడడం లేదు’’ అని అమిత్ షా ఓ వార్తా సంస్థతో అన్నారు. అదానీ అంశంపై అమిత్ షా స్పందించడం ఇదే మొదటిసారి.


More Telugu News