ఏరో ఇండియా షోలో కళ్లు చెదిరే ప్రదర్శనలు

  • హెలికాప్టర్లు, విమానాల విన్యాసాలు
  • వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • ఈ నెల 17వరకు జరగనున్న కార్యక్రమం
  • చివరి రెండు రోజుల్లో ప్రజలకు అనుమతి
బెంగళూరు గగనతలం వళ్లు గగుర్పొడిచే వాయు విన్యాసాలకు వేదికైంది. ఏరో ఇండియా 2023 కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఎక్విప్ మెంట్, సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించనున్నారు. బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రం ఈ విన్యాసాల సదస్సుకు వేదికగా నిలుస్తోంది. ఈ ప్రదర్శనలో సుమారు 100 దేశాలు పాల్గొంటున్నాయి. 

హెలికాప్టర్లు, వాయుసేన విమానాలు అద్భుత ప్రదర్శనలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లైట్ కాంబాట్ హెలికాప్టర్ ‘ప్రచండ్’ ఏరోబాటిక్ సైతం ప్రదర్శనలో పాల్గొంది. ఈ విన్యాసాలను ప్రధాని మోదీ సైతం ఆసక్తిగా వీక్షించారు. ఏరో ఇండియా 2023లో మొత్తం 809 ఎగ్జిబిటర్లు పాల్గొంటుండగా, అందులో 110 విదేశాలకు చెందినవి. తేజాస్ యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈ నెల 17న ముగుస్తుంది. సాధారణ ప్రజలను చివరి రెండు రోజుల్లో అనుమతించనున్నారు.


More Telugu News