అప్పుడు విజయసాయి రెడ్డి.. ఇప్పుడు అమర్ నాథ్: బుద్ధా వెంకన్న

  • ఉత్తరాంధ్రలో అమర్ నాథ్ ట్యాక్స్ అమలవుతోందన్న వెంకన్న
  • రియలెస్టేట్ కంపెనీలు ఎక్కడ లేఔట్ లు వేసినా వాటా కోసం బెదిరిస్తున్నారని ఆరోపణ
  • క్వారీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శ
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అక్రమార్జనలో సఫలమైన మంత్రి... రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో గతంలో విజయసాయి రెడ్డి ట్యాక్స్ అమల్లో ఉండేదని... అవినీతి పెరిగిపోవడంతో ఆయనను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ పదవి నుంచి జగన్ తప్పించారని అన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అమర్ నాథ్ ట్యాక్స్ అమలవుతోందని ఆరోపించారు. 

రియలెస్టేట్ కంపెనీలు ఎక్కడ లేఔట్ లు వేసినా వాటా ఇవ్వాలని అమర్ నాథ్ బెదిరిస్తున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. అనకాపల్లి జిల్లాలో క్వారీ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన రాజధాని పేరుతో భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.


More Telugu News