టీ20 వరల్డ్ కప్ లో దాయాదిని దంచికొట్టిన భారత్ అమ్మాయిలు

  • దక్షిణాఫ్రికా గడ్డపై మహిళల టీ20 వరల్డ్ కప్
  • కేప్ టౌన్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్
  • మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యఛేదన
మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం చేసింది. దాయాది పాకిస్థాన్ తో కేప్ టౌన్ లో జరిగిన ఈ గ్రూప్-బి మ్యాచ్ లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేధించారు. 

జెమీమా రోడ్రిగ్స్ (53 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో మెరిసిన వేళ, షెఫాలీ వర్మ (33), రిచా ఘోష్ (31 నాటౌట్) రాణించగా... టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ యస్తికా భాటియా 17, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 16 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నష్రా సంధూ 2, సాదియా ఇక్బాల్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేయడం తెలిసిందే. ఈ టోర్నీలో భారత అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్ ను ఈ నెల 15న వెస్టిండీస్ తో ఆడనున్నారు. ఈ మ్యాచ్ కూడా కేప్ టౌన్ లోనే జరగనుంది.


More Telugu News