​మంత్రి రోజా నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర​

  • గత 17 రోజులుగా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నేటితో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ముగిసిన యాత్ర
  • చినరాజకుప్పం వద్ద నగరి నియోజకవర్గంలోకి ప్రవేశం
  • లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన నగరి నియోజకవర్గ ప్రజలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ముగిసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తిచేసుకున్న లోకేశ్ చినరాజకుప్పం వద్ద నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. నగరి ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నగరి నియోజకవర్గం నుంచి ఏపీ మంత్రి రోజా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నగరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇక నేటి పాదయాత్ర సందర్భంగా కేఏం పురంలో గ్రామస్తుల విజ్జప్తి మేరకు లోకేశ్ మాట్లాడుతూ... త‌న ప్రచార‌ర‌థం, మైక్, చివ‌రికి నిల్చునే స్టూలు కూడా పోలీసులు లాగేసుకున్నార‌ని...5 కోట్లమంది ప్రజాశీస్సులతో కొనసాగుతున్న యువగళం గొంతు నొక్కడం జగన్ రెడ్డి తరం కాదంటూ మైకు లేకుండానే ప్రజలనుద్దేశించి మాట్లాడారు. "రాష్ట్రంలో ఎంతో మంది పాద‌యాత్రలు చేశారు. వారి పాద‌యాత్రల‌కు లేని ఇబ్బంది నా పాద‌యాత్రకే ఎందుకు? పోలీసులు నా గొంతులో సౌండ్‌ని నొక్కేయ‌లేరు. నా చుట్టూ వేలాది మంది పోలీసులు...పైన డ్రోన్లు... నేనంటే నీకు ఎందుకంత భ‌యం జ‌గ‌న్ రెడ్డీ నీకు?" అని ప్రశ్నించారు. 

నీ బాధితులు కాని వారెవరో చెప్పు జగన్!

విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, క‌ర్షకులు, మ‌హిళ‌లు, వృద్ధులు అంద‌రూ జ‌గ‌న్ ప్రభుత్వ బాధితులేనని లోకేశ్ విమర్శించారు. "నేను మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన‌ ప‌రిశ్రమ‌ల‌తో వేలాది ఉద్యోగాలు వ‌చ్చాయి. ఆ ప‌రిశ్రమ‌ల‌ని నేడు జ‌గ‌న్ రెడ్డి త‌రిమేస్తున్నాడు. రాయ‌ల‌సీమ‌లో వేలాది మందికి ఉపాధి క‌ల్పించిన అమ‌ర్ రాజాని త‌రిమేశాడు. జాబు క్యాలెండ‌ర్ అని సున్నా చుట్టేశాడు. మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ద‌గా చేశాడు. ఉద్యోగుల‌కు టైముకి జీతాలు లేవు" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.

బాబాయ్ ని చంపేనోడిని సైకో అనరా?


జ‌గ‌న్ చేసేవి అడుగడుగునా మోసాలేనని లోకేశ్ అన్నారు. జ‌గ‌న్ మ‌ళ్లీ జ‌నం ముందుకు వ‌స్తాడు... ముద్దులు పెడ‌తాడు... కిలో బంగారం ఇస్తానంటాడని తెలిపారు. "ఈసారి జ‌నం మోస‌పోరు. ముద్దులు పెడితే, తిరిగి గుద్దుతారు. సొంత బాబాయ్ ని చంపినోడు...సొంత త‌ల్లి, చెల్లిని గెంటేసినోడు... ప్రజ‌ల్ని హింసించే జ‌గ‌న్ రెడ్డిని సైకో అనే అంటాం" అని స్పష్టం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ కాదు... ఓడిపోయింది ప్ర‌జ‌లు అని పేర్కొన్నారు.


లోకేష్ ను కలిసిన గౌడ సామాజికవర్గీయులు


లోకేశ్ ను ఈడిగపల్లి గౌడ సామాజికవర్గీయులు పాదయాత్ర దారిలో కలిసి వినతిపత్రం సమర్పించారు. గీత కార్మికులకు గుర్తింపుకార్డులు, పనిముట్లు, టీవీఎస్ ఎక్సెల్ వాహనం ఇవ్వాలని కోరారు. "బీమా పాలసీని రూ.20లక్షలకు పెంచాలి. కల్లుగీత సహకార సంఘానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలి, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. బీసీలోన్లు గీత కార్మికులకు అందించాలి, 45 ఏళ్లకే పెన్షన్లు అందించాలి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 50శాతం ఉద్యోగ అవకాశాలివ్వాలి. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలి" అని కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... గీత కార్మికుల పట్ల టీడీపీ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.. కల్లుగీత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. న్యాయబద్దమైన డిమాండ్లన్నింటినీ పరిశీలించి నెరవేరుస్తామని తెలిపారు. 


యువనేతను కలసిన మైనారిటీ సోదరులు

నారా లోకేశ్ ను కలిసిన కార్వేటినగరం మండలం ఆలత్తూరు మైనారిటీలు తమ సమస్యలను విన్నవించారు. మైనారిటీల ఉన్నత చదువుకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, ఉచిత విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరారు. విదేశీ విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య ఉచితంగా అందించాలని, మైనారిటీల సంక్షేమాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ...  జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై కక్షగట్టి హత్యలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి టీడీపీ చిత్తశుద్దితో కట్టుబడి ఉందని, విదేశీ విద్య టీడీపీ చేపట్టిన పవిత్రమైన కార్యక్రమం... దాన్ని వైసీపీ నిలిపేసిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే విదేశీవిద్యను పునరుద్ధరిస్తాం...మైనారిటీ విద్యార్థులకు పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

లోకేశ్ ను కలిసిన మంత్రి నారాయణస్వామి సొంత గ్రామ ప్రజలు

పాదయాత్ర దారిలో యువనేత నారా లోకేష్ మంత్రి నారాయణస్వామి సొంత గ్రామం డీఎం పురం గ్రామస్తులు కలిసి వినతిపత్రం సమర్పించారు. సర్వే నెం. 491/2 లోని 3,150 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమిని నారాయణస్వామి ఆక్రమించి తమ పొట్టగొట్టాలని చూస్తున్నారని వాపోయారు. కార్వేటినగరం రాజుల పాలన నుండి ఈ భూమిలో 7 గ్రామాల ప్రజలం పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ భూమిని మంత్రి నారాయణ స్వామి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడని, భూమిని. ఆక్రమించి తమ పొట్ట కొట్టొద్దని వేడుకునేందుకు వెళితే తమను తిట్టి పంపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అడవిని కాపాడి చిన్న రిజర్వాయర్ నిర్మించి అండగా నిలవాలని వారు లోకేశ్ ను కోరారు.

అందుకు లోకేశ్ స్పందిస్తూ.... పేదవాళ్ల పొట్ట కొట్టడమే జగన్ రెడ్డి, తన మంత్రుల పని అని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక కొండలు, గుట్టలు, మైదాన ప్రాంతాలను దోచుకుంటున్నారు. మంత్రి భూ కబ్జా బాగోతంపై టీడీపీ న్యాయబద్దమైన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. తరతరాలుగా పేదవాళ్లు వాడుకుంటున్న భూమిని టీడీపీ కాపాడుతుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్ నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటానని తెలిపారు.



More Telugu News