ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్.. సుప్రీం జడ్జిగా పలు చారిత్రాత్మక తీర్పులు

  • ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిన్ అబ్దుల్ నజీర్
  • ఈ జనవరిలో సుప్రీం జడ్జిగా పదవీవిరమణ
  • సుప్రీం న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన జస్టిస్ నజీర్
ఏపీ రాష్ట్ర గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం పన్నెండు రాష్ట్రాల గవర్నర్‌ల నియామకం చేపట్టారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను చత్తీస్ గఢ్ గవర్నర్‌గా నియమించారు. 

జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టు జడ్జిగా పలు కీలక తీర్పులు వెలువరించారు. అయోధ్య రామమందిరంపై ప్రతిష్ఠాత్మక తీర్పు ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయనా ఒకరు. ఇటీవలే పదవీ విరమణ చేశారు. జస్టిస్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా అవకాశం దక్కించుకున్నారు. 

ఫిబ్రవరి 2017లో జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. త్రిపుల్ తలాక్ చెల్లదంటూ 2017లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఉన్నారు. 2019లో అయోధ్య రామమందిరంపై తీర్పు వెలువరించిన రాజ్యంగ ధర్మాసనంలోనూ ఆయన సభ్యులు. ఆ ధర్మాసనంలోని ఒకే ఒక మైనారిటీ న్యాయమూర్తి జస్టిస్ నజీర్. అయోధ్యలో హిందూ నిర్మాణం ఉనికి ఉందంటూ పురావస్తుశాఖ ఇచ్చిన తీర్పును ఆయన సమర్ధించారు. నోట్ల రద్దు చట్టబద్ధమని ప్రకటించిన సుప్రీం ధర్మాసనంలోనూ ఆయన సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేసిన జస్టిస్ నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవికి సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.


More Telugu News