కారు దొంగలను పట్టిచ్చిన యాపిల్ ఎయిర్ ట్యాగ్

  • దొంగిలించిన కారు ఎక్కడుందో నిమిషాల్లోనే గుర్తింపు
  • ఆ సమాచారంతో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
  • అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఘటన
ఇంటిముందు పార్క్ చేసిన కారును దొంగలు ఎత్తుకుపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.. పోలీసులు పరిశోధించి, దొంగలను పట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా మన కారు అదే షేపులో ఉంటుందో.. ఏ పార్టుకు ఆ పార్టుగా విడిపోయి ఏ సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనో లేక రాష్ట్రాలే దాటిపోతుందో ఊహకు కూడా అందదు. అలాకాకుండా దొంగతనానికి గురైన కారు ఎక్కడుందో జస్ట్ నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలిగితే ??

అదెలా సాధ్యమంటారా? సాధ్యమేనని అమెరికాకు చెందిన ఓ జంట చెబుతోంది. తాము నిమిషాల వ్యవధిలో కారు లొకేషన్ ను గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లి దొంగలను అరెస్టు చేశారని వెల్లడించారు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ సాయంతో పోయిందనుకున్న కారును తిరిగి దక్కించుకున్నామని చెప్పారు.

నార్త్ కరోలినా రాష్ట్రంలోని క్యారీ టౌన్ కు చెందిన లెస్లీ మహమ్మద్ కారును ఇటీవల దొంగలు ఎత్తుకెళ్లారు. రాత్రి ఇంటిముందు పార్క్ చేసిన కారును ముగ్గురు దుండగులు తీసుకెళ్లారు. అప్పుడు మంచి నిద్రలో ఉన్న మహమ్మద్ ను యాపిల్ ఎయిర్ ట్యాగ్ అలర్ట్ చేసింది. నిద్రలోంచి లేచి చూడగా.. కారు ప్రయాణిస్తున్నట్లు మ్యాప్ చూపించింది.

పార్క్ చేసిన కారు ప్రయాణించడమేంటని బయటికొచ్చి చూడగా.. ఇంటిముందు కారు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి కారు చోరీ జరిగిందంటూ మహమ్మద్ ఫిర్యాదు చేశాడు. ఆపై కారులో అమర్చిన ఎయిర్ ట్యాగ్ సాయంతో కారు లొకేషన్ ను గుర్తించి, ఆ వివరాలను పోలీసులకు అందజేశాడు. దీంతో నిమిషాల వ్యవధిలోనే కారు ఉన్న చోటుకు వెళ్లిన పోలీసులు.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News