సమస్యలు వింటూ... నేనున్నానని భరోసా ఇస్తూ... నేటి లోకేశ్ పాదయాత్ర వివరాలు ఇవిగో!

  • జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • 200 కిమీ మైలురాయి అందుకున్న లోకేశ్ పాదయాత్ర
  • కత్తెరపల్లి జంక్షన్ లో శిలాఫలకం ఆవిష్కరణ
  • వివిధ వర్గాలతో భేటీ
  • అభివృద్ధికి తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందన్న లోకేశ్
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం నాటికి 200 కిలోమీటర్ల మైలురాయిని అందుకుంది. జీడీ నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కత్తెరపల్లి జంక్షన్ లో యువనేత పాదయాత్ర 200 కిలోమీటర్లు చేరుకోగానే... కార్యకర్తలు లోకేశ్ పై పూలవర్షం కురిపించారు. పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ జయజయధ్వానాలు పలికారు. జయహో లోకేశ్... జయహో తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. 

యువగళం జైత్రయాత్ర 200 కిలోమీటర్లు చేరుకున్నందుకు గుర్తుగా టీడీపీ శ్రేణులు ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జీడీ నెల్లూరులో మహిళా డిగ్రీ కాలేజి లేదని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇక్కడ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

ప్రజాచైతన్యమే లక్ష్యంగా వేగంగా అడుగులు

400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా, నిర్ణీత టార్గెట్ కంటే ముందుగానే లోకేశ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. రోజుకు సగటున 10 కిలోమీటర్లు నడవాలన్నది లక్ష్యం కాగా, గత 16 రోజుల్లో సగటున 12.5కిలోమీటర్లు నడిచారు. లోకేశ్ నేడు అత్యధికంగా 17.7కిలోమీటర్లు నడిచారు. 

బెంగుళూరు వ్యాపారులతో లోకేష్ భేటీ

ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ విడిది కేంద్రంలో బెంగుళూరులో స్థిరపడిన జీడీ నెల్లూరు వ్యాపారులతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైకో పోయి, సైకిల్ వచ్చిన వెంటనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. 

"పెట్టుబడులు పెట్టడానికి అంతా సిద్దంగా ఉన్నారు. ఉన్న వనరుల ఆధారంగా ఏ జిల్లాకు ఏ పరిశ్రమలు అవసరమో మా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే టార్గెట్ గా పెట్టుకున్నాం. టీడీపీ అధికారంలోకి రాగానే రీబిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. పరిశ్రమలు, వ్యాపారాలు చేసే వారికి టీడీపీ పాలనలో ఎటువంటి వేధింపులు లేకుండా అన్ని అనుమతులు లభిస్తాయి. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు సమయానికి సబ్సిడీలు అందిస్తాం" అని వివరించారు. 

యాదవ సామాజికవర్గీయులతో లోకేశ్ ముఖాముఖి

ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ విడిది కేంద్రం వద్ద యాదవ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాదవులు మాట్లాడుతూ... వైసీపీ పాలనలో యాదవులం ఆర్థికంగా చితికి పోయామని... గొర్రెలు, మేకలు కొనడానికి సబ్సిడీలో రుణాలు అందడం లేదని, పశువుల మేతకు ఉపయోగించే భూమిని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 

అందుకు లోకేశ్ బదులిస్తూ... టీడీపీ హయాంలో యాదవులకు పెద్దపీట వేశామని వెల్లడించారు. జగన్ రెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వం అని, యాదవులు ఆర్ధికంగా బలపడితే తన మాట వినరు అనే ఆలోచనతోనే మీకు తీరని అన్యాయం చేశాడు అని వెల్లడించారు. 

"టీడీపీ హయాంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేశాం. టీడీపీ హయాంలో ఆర్ధిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు, టీటీడీ చైర్మన్ గా పుత్తా సుధాకర్ యాదవ్ కు, తుడా చైర్మన్ గా నరసింహ యాదవ్ కు, ఏపీఐఐసీ చైర్మన్ గా కృష్ణయ్య యాదవ్ కు పదవులిచ్చాం. ఇప్పుడు ప్రధాన పదవుల్లో అంతా జగన్ మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం వారే" అని తెలిపారు.  

లోకేశ్ ను కలిసిన ఎస్టీ సామాజిక వర్గీయులు

యువగళం పాదయాత్ర సందర్భంగా ఎస్.ఆర్.పురం మండలం మెదవాడ పంచాయతీ ఎస్టీ కాలనీ వాసులు లోకేశ్ ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. తమకు స్థిర నివాసాలు లేవని, వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్టీ కార్పొరేషన్ నుండి ఎటువంటి లోన్లు అందడం లేదని, ఎస్టీ విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక సాయం అందడం లేదని, టీచర్ ట్రైనింగ్ చేయకున్నా టీచర్ ఉద్యోగాలు ఇచ్చే విధానం నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ...  ఎస్టీలకు జగన్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి ద్రోహం చేసిందని మండిపడ్డారు. విదేశీవిద్య పథకాన్ని నిలిపివేసి పేద ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్టీ కార్పొరేషన్ కు నిధులిచ్చి బలోపేతం చేస్తామని, ఎస్టీ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 


మైక్ లాగేసుకున్న పోలీసులు... లోకేశ్ ఫైర్

జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పుల్లూరు క్రాస్ రోడ్డు వద్ద లోకేశ్ నుంచి పోలీసులు మైక్ లాక్కున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయమార్గంలో పాదయాత్ర చేస్తున్నాను... ప్రజలసొమ్ము తిని నేను జైలుకెళ్లి రాలేదు... నా పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు? జగన్ పాదయాత్రలని మేము ఏనాడూ అడ్డుకోలేదు"అంటూ వ్యాఖ్యానించారు. 

అనంతరం ప్రజల్ని సైలెంట్ గా ఉండమని చెబుతూ, లోకేశ్ మైక్ లేకుండానే స్టూల్ పై నిలబడి మాట్లాడారు. "ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటానికి ప్రజల్లోకి వచ్చాను. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గంలో అభివృద్ది నిల్లు...అవినీతి ఫుల్లు. నా మైక్ లాక్కోవడానికి వస్తున్న 1000 మంది పోలీసులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అడ్డుకోవాలి. 

ప్యాలస్ పిల్లి పనైపోయింది. నన్ను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసులు, ఆరుగురు డీఎస్పీలు ఎందుకు? మహిళలకు రక్షణ కల్పించాల్సిన దిశ డీఎస్పీ కూడా నా వెంట తిరుగుతున్నారు. పోలీసు అధికారి రఘురామిరెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. గతంలో ఐఎఎస్ లను మాత్రమే జైలుకి తీసుకెళ్ళాడు జగన్ ... ఇప్పుడు ఐపీఎస్ లను కూడా జైలుకి తీసుకుపోతాడు. పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చెయ్యడం ఆపి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చెయ్యాలి. వైసీపీ వాళ్ళకి అమలు కానీ జీఓ నెం.1 ఒక్క లోకేశ్ కే ఎందుకు అమలు చేస్తున్నారు?" అంటూ లోకేశ్ నిప్పులు చెరిగారు.


More Telugu News