ఆసీస్ ఫినిష్... రెండున్నర రోజుల్లోనే టీమిండియా జయభేరి

  • ముగిసిన నాగ్ పూర్ టెస్టు
  • ఇన్నింగ్స్ 132 పరుగులతో టీమిండియా భారీ విజయం
  • రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
  • రాణించిన అశ్విన్, జడేజా, షమీ
  • 4 టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా ముందంజ
నాగపూర్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. స్పిన్నర్లకు స్వర్గధామంలా నిలిచిన ఇక్కడి పిచ్ పై ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. కేవలం రెండున్నర రోజుల్లోనే ఫలితం తేలిన ఈ తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 

223 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసి ఆసీస్ పతనంలో పాలుపంచుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 25 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. చివరి రెండు వికెట్లను షమీ పడగొట్టడంతో కంగారూ ఇన్నింగ్స్ కు తెరపడింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులు చేయగా, టీమిండియా 400 పరుగుల స్కోరుతో బదులిచ్చింది. 

కాగా, ఈ విజయంతో టీమిండియా 4 టెస్టుల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది. అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది.


More Telugu News