అదానీ గ్రూప్‌కు మరో షాక్

  • నాలుగు అదానీ గ్రూప్ సంస్థల రేటింగ్ తగ్గించిన మూడీస్
  • స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు రేటింగ్ తగ్గింపు

హిండెన్ బర్గ్ నివేదికతో ఇబ్బందుల్లో పడ్డ అదానీ గ్రూప్ సంస్థలకు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తాజాగా మరో షాకిచ్చింది. గ్రూప్‌లోని నాలుగు కంపెనీల షేర్ల రేటింగ్‌ను తగ్గించింది. గతంలో ‘స్టేబుల్‌’గా ఉన్న  వీటి రేటింగ్‌ను ‘నెగెటివ్‌’కు మార్చింది. ఆయా కంపెనీల షేర్లు ప్రతికూల స్థితిని ఎదుర్కొంటున్నాయని సూచిస్తూ వాటి రేటింగ్ తగ్గించింది. ఈ మేరకు అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్‌మిషన్ వన్ స్టెప్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై కంపెనీల రేటింగ్‌లో మార్పులు చేసింది.   

అయితే.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ ఇంటర్నేషనల్ కంటెయినర్ టర్మినల్, అదానీ ట్రాన్స్‌మిషన్ రెస్ట్రిక్టెడ్ గ్రూప్ 1 షేర్ల రేటింగ్‌ను ‘స్టేబుల్’గా ఉంచుతున్నట్టు మూడీస్ పేర్కొంది. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఒడిదుడుకులకు లోనైన అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ రెటింగ్స్‌ను నిర్ణయించినట్టు తెలిపింది. 

అదానీ గ్రూప్ కార్పొరేట్ పాలన సక్రమంగా లేదని, సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని యూఎస్ సంస్థ హిండెన్ బర్గ్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో.. అదానీ సంస్థల షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. భారీగా సంపద కోల్పోయిన గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. అపరకుబేరుల జాబితాలో కిందకు జారారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అదానీ..అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయవాద సంస్థ వాచ్ టెల్ ను నియమించుకున్నారు. ఈ సంస్థ గతంలో ట్విట్టర్ తరఫున ఎలాన్ మస్క్‌పై కోర్టులో పోరాటం చేసింది.


More Telugu News