గుండెకు గుడ్డుతో ఎంతో మేలు..

  • రోజులో ఒక కోడి గుడ్డు తినొచ్చు
  • లేదంటే రెండు గుడ్లలో తెల్లసొన తీసుకోవచ్చు
  • రక్తపోటు, బ్లడ్ షుగర్ నియంత్రణలో
  • బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
గుడ్డు తినడం వల్ల గుండెకు హాని జరుగుతుందేమో? ఎక్కువ మందికి వచ్చే సందేహం ఇది. న్యూట్రియెంట్స్ అనే జర్నల్ లో ప్రచురితమైన తాజా పరిశోధన ఫలితాలను చూస్తే ఈ సందేహం తీరిపోతుంది. రోజూ కోడిగుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు. 2,300 మందిపై బోస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.

వారంలో ఐదు అంతకంటే ఎక్కువ కోడి గుడ్లను తినే వారిలో బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు రక్తపోటు కూడా తక్కువగా ఉంటుందట. టైప్-2 మధుమేహం రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. గుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి చెడు కంటే మంచే ఎక్కువన్నది ఈ పరిశోధకులు తేల్చిన అంశం.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫారసు ప్రకారం ఒకరు రోజులో ఒక కోడి గుడ్డు పూర్తిగా లేదంటే రెండు కోడి గుడ్లలో కేవలం తెల్లసొన భాగాన్ని తీసుకోవచ్చు. కోడి గుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలం. ప్రతి కిలో శరీర బరువుకి 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము వరకు ప్రొటీన్ రోజువారీ అవసరం. కానీ, చాలా మంది రోజువారీగా కావాల్సిన ప్రొటీన్ లో సగం కూడా తీసుకోరు. ఎన్నో అనారోగ్యాలకు ఇది కారణం అవుతుంటుంది. 60 కిలోల శరీర బరువు ఉన్న వారికి ఎంత లేదన్నా రోజులో 50-60 గ్రాముల ప్రొటీన్ కావాలి. ఒక కోడి గుడ్డులో 6 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్ ఎక్కువ. అందుకని రోజులో రెండు కోడిగుడ్లలోని తెల్ల భాగాన్ని తీసుకోవాలి. 

ఇంకా కోడి గుడ్డులో విటమిన్ ఏ 6 శాతం (రోజువారీ కావాల్సిన మొత్తంలో). విటమిన్ బీ5 7 శాతం, విటమిన్ బీ12 9 శాతం, ఫాస్ఫరస్ 9 శాతం, విటమిన్ బీ2 15 శాతం, సిలీనియం 12 శాతం ఉంటాయి. రోజుకు ఒక కోడిగుడ్డు తినేవారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 4.4 పాయింట్ల మేర తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.


More Telugu News