టర్కీలో ఉత్తరాఖండ్ యువకుడు గల్లంతు..

  • హోటల్ శిథిలాల కింద పాస్ పోర్ట్, లగేజ్ గుర్తింపు
  • మృతదేహం లేకపోవడంతో బతికే ఉండొచ్చంటున్న అధికారులు
  • ఆస్పత్రులు, పునరావాస కేంద్రాల్లో వెతుకులాట
ఉత్తరాఖండ్ లోని పౌరి గర్వాల్ కు చెందిన యువకుడు ఒకరు టర్కీలో గల్లంతయ్యారు. భూకంపం ధాటికి ఆయన ఉంటున్న హోటల్ నేలమట్టం అయింది. శిథిలాల్లో పాస్ పోర్ట్, లగేజీ బయటపడ్డాయి కానీ యువకుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పౌరి గర్వాల్ లోని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే, హోటల్ శిథిలాల కింద మృతదేహాలు లేకపోవడంతో ఆ యువకుడు ప్రాణాలతోనే ఉండి ఉంటాడని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.

పౌరి గర్వాల్ కు చెందిన విజయ్ కుమార్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కంపెనీ తరఫున టర్కీకి వెళ్లిన విజయ్ కి మలత్యా సిటీలోని ఓ హోటల్ లో బస ఏర్పాటు చేశారు. సోమవారం సంభవించిన భూకంపంతో విజయ్ ఉంటున్న హోటల్ కూలిపోయింది. ఈ వార్తలు చూసి పౌరి గర్వాల్ లోని విజయ్ కుటుంబ సభ్యులు ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే, ఫోన్ కలవకపోవడం, విజయ్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించడంతో.. అధికారులు రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు. కూలిన హోటల్ శిథిలాల కింద విజయ్ పాస్ పోర్ట్, లగేజ్ దొరకిందని శుక్రవారం సమాచారం అందింది. హోటల్ శిథిలాల కింద మృతదేహాలు బయటపడలేదని, విజయ్ బతికే ఉండి ఉంటాడని రెస్క్యూ సిబ్బంది అభిప్రాయపడ్డారు. విజయ్ కోసం చుట్టుపక్కల ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలలో గాలిస్తున్నట్లు వివరించారు.


More Telugu News