యాహూలో 20 శాతం మంది ఉద్యోగుల తొలగింపు

  • పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తొలగింపులు చేపట్టామన్న యాహూ
  • ప్రకటనల విభాగంలో 50 శాతం మందికి ఉద్వాసన 
  • డిమాండ్ సైడ్ ప్లాట్‌ఫామ్‌పై దృష్టి కేంద్రీకరిస్తామని ప్రకటన
టెక్ రంగంలో తొలగింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం యాహూ సంస్థ.. 20 శాతం మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ప్రకటించింది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. సంస్థ ప్రకటనల విభాగంలో అత్యధికంగా 50 శాతం మంది ప్రభావితం కానున్నారని చెప్పింది. అంతేకాకుండా.. ఈ వారం సుమారు వెయ్యి మందిని తొలగించొచ్చని పేర్కొంది. 

ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ 2021లో యాహూను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 5 బిలియన్ డాలర్లతో యాహూను అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ చేజిక్కించుకుంది. కాగా.. ఉద్యోగుల తొలగింపుల తరువాత తమ దృష్టిని పూర్తిగా డిమాండ్ సైడ్ ప్లాట్‌ఫామ్ వ్యాపారంపై కేంద్రీకరించే అవకాశం కలుగుతుందని యాహూ ఓ ప్రకటనలో పేర్కొంది. 

రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న మాద్యం ముప్పు కారణంగా అనేక అమెరికా సంస్థలు వ్యాపార ప్రకటనల ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో.. తమ సేవలకు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్న పలు అమెరికా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాయి. గోల్డ్‌మన్ సాక్స్ నుంచి ఆల్ఫాబెట్ వరకూ పలు కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించాయి.


More Telugu News