బాలయ్యతో మల్టీస్టారర్ చేయడానికి రెడీ: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై పవన్!

  • 'అన్ స్టాపబుల్ 2'లో 'వీరమల్లు' ప్రస్తావన 
  • పవన్ తొడగొట్టే సీన్ గురించి చెప్పిన క్రిష్ 
  • ఇంట్లో గొడవలు రాకుండా చూసుకుంటానన్న పవన్ 
  • ప్రజాసేవతో పాటు ఆయన సినిమాలు కూడా చేయాలన్న బాలయ్య  
'అన్ స్టాపబుల్ 2' టాక్ షోలో పవన్ కల్యాణ్ పాల్గొన్న సెకండ్ ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయింది. ఈ వేదికపై రాజకీయపరమైన సంభాషణ ఎక్కువగా జరిగినప్పటికీ, 'వీరమల్లు' సినిమాకి సంబంధించిన టాపిక్ కూడా వచ్చింది. ఆ సమయంలో డైరెక్టర్ 'క్రిష్' కూడా స్టేజ్ పైకి వచ్చాడు. ఈ సినిమాలోని ఒక సందర్భంలో బాలయ్య మాదిరిగానే పవన్ తొడగొడతాడని క్రిష్ చెప్పగానే బాలయ్య సంబరపడిపోయారు. 

ఇక బాలయ్య ప్రశ్నలు .. అందుకు సమాధానంగా పలకపై పవన్ 'ఎస్ - నో' అని రాసి చూపించే రౌండ్ కూడా సరదాగా నడిచింది. తనతో మల్టీ స్టారర్ చేయాలని ఉందా? అనే బాలయ్య ప్రశ్నకి, పవన్ 'ఎస్' అంటూ పలకపై రాసి చూపించడంతో ఆడిటోరియం అంతా సందడిగా మారిపోయింది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు .. సారీ చెప్పే సందర్భాన్ని గురించి బాలయ్య అడిగితే, గొడవలు రాకుండా చూసుకుంటాననీ .. అందువలన సారీ చెప్పాల్సిన అవసరం ఉండదని పవన్ నవ్వేశారు.

ఇక చివర్లో పవన్ మాట్లాడుతూ .. "బాలకృష్ణగారు మంచి మనసున్న మనిషి. ఒక దశలో ఆయన సినిమాలు ఆడలేదు. ఆ సమయంలో మా ఫ్యామిలీలోని అందరం కూడా ఆయన సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నాము. మా రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది" అని అన్నారు. ఒక వైపున ప్రజాసేవ చేస్తూనే మరో వైపున సినిమాలు చేయాలని బాలయ్య చెబుతూ పవన్ భుజం తట్టడంతో సెకండ్ సీజన్ ముగిసింది.  



More Telugu News