క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎస్సైపై కానిస్టేబుల్ ప్రతీకారం.. మూడేళ్ల తర్వాత హత్య!

  • మహారాష్ట్రలోని థానేలో ఘటన
  • సహచర ఉద్యోగితో గొడవ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలకు ఆదేశం
  • ప్రతీకారంతో రగిలిపోయిన నిందితుడు
  • బుధవారం ఎస్సైని కర్రతో బాది హత్య
తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎస్సైపై పగ పెంచుకున్న ఓ కానిస్టేబుల్ మూడేళ్ల తర్వాత అతనిని హతమార్చాడు. మహారాష్ట్రలోని థానేలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ పంకజ్ యాదవ్ మూడేళ్ల క్రితం సహచర ఉద్యోగితో గొడవపడ్డాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

ఎస్సై బసవరాజ్ గార్గ్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో పంకజ్ యాదవ్‌దే తప్పని తేలడంతో ఆయన క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. వేతనంలో కోత విధించాలని సూచించారు. ఇక, అప్పటి నుంచి ఆయనపై కక్ష పెంచుకుని ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పంకజ్ బుధవారం రాత్రి ఎస్సై బసవరాజ్ గదిలోకి చొరబడి కర్రతో దాడిచేసి హత్య చేశాడు. నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News