మరోసారి రోడ్డుపై నిలిచిపోయిన ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారు... ఊడిపోయిన టైరు

  • రాజాసింగ్ అసెంబ్లీ నుంచి ఇంటికి వెళుతుండగా ఘటన
  • ధూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీసు వద్ద ఊడిపోయిన టైరు
  • ఆ సమయంలో నిదానంగా ప్రయాణిస్తున్న వాహనం 
  • రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా మొరాయిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలకు బలం చేకూర్చుతూ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైరు ఊడిపోయింది. అయితే రాజాసింగ్ కు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. 

వాహనం కండిషన్ సరిగా లేకపోవడంతో, రాజాసింగ్ తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నారు. అందుకే, టైరు ఊడిపోయినా ఏమంత నష్టం కలగలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రాజాసింగ్ తిరిగి తన నివాసానికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. ధూల్ పేట ఎక్సైజ్ కార్యాలయం ముందుకు వచ్చే సరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైరు ఊడిపోయింది. దాంతో రోడ్డుపైనే వాహనం నిలిచిపోయింది. 

ముందుజాగ్రత్తగా వాహనం నిదానంగా నడపడం వల్లే ప్రమాదం తప్పిందని, ఒకవేళ తాము సాధారణ వేగంతో ప్రయాణించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సిగ్గు అనేది ఉంటే, ఇప్పుడైనా తన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని స్పష్టం చేశారు. 

రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇప్పటివరకు పలుమార్లు రోడ్డుపై ఆగిపోయింది. అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చుతున్న తెలంగాణ ప్రభుత్వం, తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకోవడంలేదని రాజాసింగ్ ఆవేదన వెలిబుచ్చారు.


More Telugu News