మీరు చల్లే బురదలో కూడా కమలం వికసిస్తుంది: రాజ్యసభలో ప్రధాని మోదీ

  • కొనసాగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం
  • అదానీ అంశంలో జేపీసీ వేయాలంటూ విపక్షాల డిమాండ్
  • కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మోదీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగించారు. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. అదానీ వ్యవహారంపై ప్రధాని మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల సభ్యుల నినాదాల మధ్యే ప్రధాని మోదీ ప్రసంగం సాగింది. 

మీరు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని విపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని పేర్కొన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను నిరాకరిస్తున్నారని తెలిపారు. యూపీఏ పాలనను తాను నిశితంగా పరిశీలించానని, ఏ ఒక్క సమస్యకు వారు దీర్ఘకాలిక పరిష్కారం చూపలేదని, సమస్యలకు పైపూత పూశారని విమర్శించారు. 

దేశ ప్రజలను వంచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశ ప్రగతి అవకాశాలను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గుంతలను మాత్రమే తవ్విందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫస్ట్ అనేది కాంగ్రెస్ నినాదం అని పేర్కొన్నారు. గరీబీ హఠావో అనేది కాంగ్రెస్ కు ఒక నినాదం మాత్రమేనని తెలిపారు. 

నాడు జనం డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండేవని, అవన్నీ మూతపడ్డాయని తెలిపారు. కానీ, ఎన్డీయే ప్రభుత్వం ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతోందని మోదీ స్పష్టం చేశారు. తాము పాలనతో ప్రజల మనసులు గెలుచుకున్నామని, రాజకీయాలతో కాదని చెప్పారు. 

దేశంలో అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నామని, పార్టీ బలం పెంచుకోవడం తమ ధ్యేయం కాదని స్పష్టం చేశారు. దేశంలో 11 కోట్ల ఇళ్లకు తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. మహిళల కోసం 11 కోట్ల టాయిలెట్లు ఏర్పాటు చేశామని అన్నారు. తాము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తామని, వికాసాన్నే నమ్ముతాం తప్ప విపక్షాన్ని కాదని ఉద్ఘాటించారు. 

విపక్షం ఆఖరికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని, మేకిన్ ఇండియా వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బతికించిందని అన్నారు.


More Telugu News