కేఎస్ భరత్ టెస్టు క్రికెట్ అరంగేట్రం చేయడంపై సీఎం జగన్, చంద్రబాబు స్పందన

  • నేడు టీమిండియా-ఆస్ట్రేలియా టెస్టు ప్రారంభం
  • టీమిండియా తుది జట్టులో భరత్ కు స్థానం
  • వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ గా దేశవాళీల్లో విశేష ప్రతిభ
  • భరత్ ను అభినందించిన సీఎం జగన్, చంద్రబాబు
ఆంధ్రా క్రికెట్ ఆటగాడు కేఎస్ భరత్ నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్, చంద్రబాబు స్పందించారు. 

మనవాడు కోన శ్రీకర్ భరత్ ఇవాళ టీమిండియా-ఆస్ట్రేలియా తొలి టెస్టు ద్వారా టెస్టు క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడని సీఎం జగన్ వివరించారు. ఈ సందర్భంగా భరత్ ను అభినందిస్తున్నానని, అతడి కెరీర్ విజయవంతం అవ్వాలంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నానని వెల్లడించారు. తెలుగు జెండా సగర్వంగా ఎగురుతూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. భరత్ టెస్టు క్రికెట్లో జాతీయ జట్టుకు ఎంపిక కావడం తెలుగు వారందరికీ గర్వకారణం అని జగన్ ట్వీట్ చేశారు. 

విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ, మన కోన శ్రీకర్ భరత్ తన కెరీర్ లో తొలి టెస్టు ఆడుతుండడం సంతోషదాయకమని తెలిపారు. ఇవాళ ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ కోసం శ్రీకర్ భరత్ టీమిండియాకు ఎంపికయ్యాడని, అతడి కెరీర్ అత్యుత్తమ రీతిలో సాగాలని కోరుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దేశం గర్వించేలా భరత్ ఆటతీరు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

29 ఏళ్ల కేఎస్ భరత్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం. ఆంధ్రా క్రికెట్ లో జూనియర్ స్థాయి నుంచి రంజీ క్రికెట్ వరకు వివిధ శ్రేణుల్లో భరత్ విశేష ప్రతిభ కనబరిచాడు. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా క్రికెట్ జట్టు ఎదుగుదలలో ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు ఏకంగా టెస్టు క్రికెట్లో జాతీయ జట్టుకు ఆడే అవకాశం రావడం అతడి నైపుణ్యానికి నిదర్శనం. 

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కేఎస్ భరత్ 86 మ్యాచ్ లు ఆడి 4,707 పరుగులు చేశాడు. వాటిలో 9 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి.


More Telugu News