7 వేల మంది ఉద్యోగుల ఔట్.. మరో అమెరికా సంస్థ షాకింగ్ నిర్ణయం

  • 7 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన వాల్ట్ డిస్నీ కంపెనీ
  • అషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదన్న సంస్థ సీఈఓ
  • డిస్నీ ఓటీటీ సర్వీస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో తగ్గుదల
హాలీవుడ్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ది వాల్ట్ డిస్నీ కంపెనీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు ఏడు వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ బాబ్ ఐగర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదే ఆయన డిస్నీ గ్రూప్ సంస్థల బాధ్యతలు చేపట్టారు. 

‘‘ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. సంస్థ కోసం ఉద్యోగులు పడుతున్న శ్రమను, వారి అంకిత భావాన్ని ఎంతో గౌరవిస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్‌ లాంటి పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే వేల మంది సిబ్బందిని తొలగించాయి. వారి బాటలోనే నడుస్తూ డిస్నీ కూడా ఉద్యోగుల తొలగింపు పర్వానికి శ్రీకారం చుట్టింది. 

గత త్రైమాసికంలో డిస్నీ ఓటీటీ సర్వీస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక శాతం మేర తగ్గి 168.1 మిలియన్లకు పడిపోయిన నేపథ్యంలో డిస్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వినియోగదారులు ఖర్చులు తగ్గించుకునేందుకు మొగ్గుచూపుతున్నారనేందుకు ఇదో సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.  అయితే.. గత త్రైమాసికంలో సంస్థ స్ట్రీమింగ్ సర్వీస్ నిర్వహణ నష్టాలు కొంతమేర తగ్గించుకోగలిగింది. దీంతో.. ఇన్వెస్టర్లకు సంస్థపై భరోసా పెరగడంతో పోస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్ ధర ఎనిమిది శాతం మేర వృద్ధి నమోదు చేసుకుంది. అంతేకాకుండా.. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పరిశీలకుల అంచనాలకు మించి డిస్నీ గ్రూప్ 23.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 
 
సుమారు రెండు దశాబ్దాల పాటూ డిస్నీకి నేతృత్వం వహించిన బాబ్ ఐగర్ 2020లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గతేడాదే ఆయన మళ్లీ సంస్థ పగ్గాలను చేపట్టారు.


More Telugu News