అమరావతి అభివృద్ధికి రూ. 2,500 కోట్లిచ్చాం.. ‘సుప్రీం’కు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం

అమరావతి అభివృద్ధికి రూ. 2,500 కోట్లిచ్చాం.. ‘సుప్రీం’కు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం
  • ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • 14 పేజీల అఫిడవిట్‌ను సమర్పించిన కేంద్రం
  • 23 ఏప్రిల్ 2015 న అమరావతి పేరుతో రాజధాని నగరాన్ని ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందన్న కేంద్రం
ఏపీ రాజధానిపై చట్టం చేసే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో కేంద్ర హోం శాఖ అండర్ సెక్రటరీ శ్యామల్ కుమార్ బిత్ నిన్న 14 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. 

ఆ అఫిడవిట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని 5వ నిబంధన చెబుతున్న దాని ప్రకారం.. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్లకు మించకుండా ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. 

విభజన చట్టంలోని సెక్షన్-6 ప్రకారం.. ఏపీ కొత్త రాజధానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి, విభజన చట్టం రూపొందించిన ఆరు నెలల్లోపు తగిన ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని అందులో పేర్కొన్నారు. అలాగే, కేంద్రం 28 మార్చి 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ.. ఏపీకి కొత్త రాజధాని ఎంపికలో తీసుకోవాల్సిన అంశాల గురించిన మార్గదర్శకాలతో అదే ఏడాది ఆగస్టు 30న నివేదిక సమర్పించింది.

ఆ నివేదికను ఏపీ ప్రభుత్వానికి పంపింది. అనంతరం 23 ఏప్రిల్ 2015న అమరావతి పేరుతో రాజధాని నగరాన్ని ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసింది. 

సెక్షన్ 94 ప్రకారం.. ఏపీ రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలి సహా ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలి. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు విడుదల చేసింది. 2014-15లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన రూ. వెయ్యి కోట్లు కూడా ఇందులో ఉన్నాయి. 

మరోవైపు, రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో చాలా వాటిని కేంద్రం ఇప్పటికే అమలు చేసినట్టు పేర్కొన్నారు. మిగిలినవి వివిధ దశల్లో అమల్లో ఉన్నట్టు చెప్పారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటు సాక్షిగా తేల్చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని స్పష్టం చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సీఆర్డీయేను రద్దు చేసి రాష్ట్రంలో మూడు రాజధానులకు వీలు కల్పించే వికేంద్రీకరణ చట్టాలను తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని మంత్రి పేర్కొన్నారు.


More Telugu News