కేసీఆర్ ఓ భూతం.. పట్టుకుని సీసాలో బంధించాలి..: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

  • అమరుల కుటుంబాలకు అనుమతి లేని ప్రగతిభవన్ ఎందుకని రేవంత్ ప్రశ్న
  • తెలంగాణ ద్రోహులకే మంత్రి వర్గంలో 90 శాతం పదవులిచ్చారని ఆరోపణ
  • కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ తమకు మద్దతివ్వాలని పిలుపు
ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్రలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. మంగళవారం ములుగు జిల్లాలో మాట్లాడుతూ.. ప్రగతిభవన్‌‌ను కూల్చివేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్రంగా మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ ములుగు, నర్సంపేట పోలీస్‌స్టేషన్లలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. 

తనపై ఫిర్యాదు చేయడంపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కేసులకు భయపడబోనని, తనకు అవి కొత్తేమీ కాదని చెప్పారు. ‘‘కేసీఆర్ భూతం లాంటివారు.. పట్టుకుని సీసాలో బంధించాలి.. లేకపోతే తట్టుకోలేం’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్‌కు సపోర్టు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

అమరవీరుల కుటుంబాలకు అనుమతి లేని ప్రగతిభవన్ ఎందుకని మరోసారి నిలదీశారు. తెలంగాణ ద్రోహులకే మంత్రి వర్గంలో 90 శాతం పదవులు అప్పజెప్పారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు.


More Telugu News