ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న ‘జూమ్’.. 1300 మందికి ఉద్వాసన

  • బ్లాగ్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసిన ‘జూమ్’
  • ఉద్యోగుల తొలగింపు బాధ్యత పూర్తిగా తనదేనన్న సీఈవో ఎరిక్
  • తన వేతనంలో 98 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటన
ఇప్పుడు అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ వంతు వచ్చింది. తమ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం అంటే దాదాపు 1,300 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ బ్లాగ్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. సంస్థలోని ప్రతి విభాగంలోనూ ఉద్యోగుల కోత ఉంటుందని జూమ్ సీఈవో ఎరిక్ యాన్ తెలిపారు. నిర్ణయం కఠినమైనదే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందని, కష్టపడి పనిచేసే, నైపుణ్యం ఉన్న తమ సహచరులను తొలగించక తప్పడం లేదని చెప్పారు. 

తన వేతనంతో పాటు, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల వేతనంలోనూ కోత ఉంటుందని ఈ సందర్భంగా ఎరిక్ పేర్కొన్నారు. కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉద్యోగుల తొలగింపునకు పూర్తి బాధ్యత తనదేనని అన్నారు.  మాటల్లోనే కాకుండా తనపై సొంతంగా చర్యలు తీసుకోవడం ద్వారా దానికి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. 

అందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనాన్ని 98 శాతం తగ్గించుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ బృందం సభ్యులు కూడా తమ మూల వేతనాలను 20 శాతం తగ్గించుకుంటారని వివరించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్ బోనస్‌లను కూడా వారు కోల్పోతారని తెలిపారు.


More Telugu News