ప్రధానికి, అదానీకి వున్న సంబంధమేంటి?: పార్లమెంటులో రాహుల్ గాంధీ

  • అదానీ ఆస్తులు 8 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 140 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఎలా పెరిగాయని నిలదీసిన రాహుల్ 
  • మోదీ పర్యటించిన దేశాల్లో అదానీ కాంట్రాక్టులు పొందారని ఆరోపణ
  • 2014లో ఢిల్లీకి మోదీ చేరుకున్నాక అసలు మ్యాజిక్ మొదలైందని ఎద్దేవా
అదానీ అంశాన్ని పార్ల‌మెంట్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేవనెత్తారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధన్య‌వాద తీర్మానంపై మాట్లాడుతూ కేంద్రంపై విమర్శల వ‌ర్షం కురిపించారు. ‘‘సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి ఏ వ్యాపారంలోనైనా అదానీ ఎప్పుడూ విఫలం కాలేదు. అనేక రంగాల్లో అదానీ ఇంత విజయాన్ని ఎలా సాధించారని యాత్రలో ప్రజలు నన్ను అడిగారు. ప్రధాన మంత్రితో అదానీకి ఉన్న సంబంధం ఏమిటి?’’ అని రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పర్యటించిన దేశాల్లో అదానీ కాంట్రాక్టులు పొందారని ఆరోపించారు.

అదానీ సుమారు 10 రంగాల్లో వ్యాపారం చేస్తున్నార‌ని, 2014 నుంచి 2022 మధ్య ఆయ‌న ఆస్తులు 8 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 140 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఎలా వెళ్లాయ‌ని యువ‌త అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు. సంపన్నుల్లో 600వ ర్యాంకు నుంచి 2వ ర్యాంకుకు అదానీ ఎలా ఎదిగారని నిలదీశారు. భార‌త్ జోడో యాత్ర స‌మ‌యంలో త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కు అంత‌టా ఒక్క‌టే పేరు వినిపించిందని, అదానీ గురించే అడుగుతున్నారని రాహుల్ అన్నారు. 

‘‘గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు ఈ అనుబంధం మొదలైంది. మోదీతో కలిసి ఓ వ్యక్తి తిరిగేవాడు. ఆయనకు నమ్మకంగా ఉండేవాడు. 2014లో ఢిల్లీకి మోదీ చేరుకున్నాక అసలు మ్యాజిక్ మొదలైంది’’ అని ఎద్దేవా చేశారు. అదానీ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా చేసేందుకు మోదీ సర్కారు అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం లాంటి అంశాల‌ను ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. అగ్నివీర్ ప‌థ‌కం ఆర్మీ ఆలోచ‌న నుంచి రాలేద‌ని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవ‌ల్ ఆలోచ‌న నుంచి వ‌చ్చిందని విమ‌ర్శించారు. అగ్నివీర్ ప‌థ‌కాన్ని బ‌లవంతంగా ఆర్మీపై రుద్దారని ఆరోపించారు. యువతకు ఆయుధ శిక్ష‌ణ నిచ్చి, వాళ్ల‌ను తిరిగి స‌మాజంలోకి పంప‌డం వ‌ల్ల హింస పెరుగుతుంద‌ని రిటైర్డ్ ఆఫీస‌ర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాహుల్ చెప్పారు.


More Telugu News