బాలికల్లో గర్భధారణ రేటు ప్రమాదకర రీతిలో 16.8 శాతం వుంది: అసోం సీఎం

  • బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చర్యలు కొనసాగుతాయన్న హిమంత బిశ్వశర్మ
  • గర్భధారణ రేటు ప్రమాదకరంగా ఉందని ఆందోళన
  • తమ చర్యలు ప్రజారోగ్యం, సంక్షేమం కోసమేనని సమర్థన
టీనేజీ వివాహాలకు వ్యతిరేకంగా అసోం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా, వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమర్థించారు. రాష్ట్రంలో బాలికల గర్భధారణ రేటు ప్రమాద ఘంటికలను మోగించే విధంగా ఉందన్నారు. ట్విట్టర్ పై ఇందుకు సంబంధించి నివేదికను షేర్ చేశారు. బాలికల వివాహాలకు వ్యతిరేకంగా చర్యలు కొనసాగుతాయని ప్రకటించారు.

శర్మ షేర్ చేసిన నివేదికను పరిశీలించినప్పుడు.. అసోంలో బాలికల గర్భధారణ రేటు 2022లో 16.8 శాతంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద 6,20,867 మంది బాలికలు 2022లో గర్భం దాల్చారు. 1,04,264 మంది బాలికలు తల్లులయ్యారు. ‘‘బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మా చర్యలు ప్రజారోగ్యం, సంక్షేమం కోసమే. అసోంలో టీనేజీల ప్రెగ్నెన్సీ రేషియో ప్రమాదకర స్థాయిలో 16.8 శాతంగా ఉంది’’ అని శర్మ ట్వీట్ చేశారు. బాలికల వివాహాలకు వ్యతిరేకంగా చర్యలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతాయని ప్రకటించారు. ప్రాంతాల వారీగా చూస్తే కొన్ని చోట్ల 28 శాతం మేర బాలికల్లో గర్భధారణ రేటు ఉండడం గమనించొచ్చు. 



More Telugu News