రూ.300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని ప్లాన్: కొల్లు రవీంద్ర

  • వైసీపీ ఆఫీసు పేరుతో ప్రభుత్వ భూమిని దోచుకునే కుట్ర చేస్తున్నారన్న కొల్లు రవీంద్ర
  • ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆస్తిని పార్టీ ఆఫీస్‌కి ఇస్తారని ప్రశ్న
  • ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడతామని స్పష్టీకరణ 
కృష్ఱా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ భూమిని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కేటాయించడంపై వివాదం కొనసాగుతోంది. సోమవారం నాడు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. పార్టీ నేతలతో కలిసి నిరసనకు దిగడం, స్థల పరిశీలనకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడారు. 

వైసీపీ కార్యాలయం పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని‌ దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ‘‘రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని ప్లాన్ చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆస్తిని పార్టీ ఆఫీస్‌కి ఇస్తారు? అది పేర్ని నాని కష్టమా, ఆయన తండ్రి కష్టమా?  చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. 

భూ రికార్డులు మార్చిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రిటైర్ అయినా చర్యలు తప్పవన్నారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం తాము పోరాడుతామని స్పష్టం చేశారు. ఆ భూమి ఏపీ పోలీసుల క్వార్టర్స్‌దని మాస్టర్ ప్లాన్‌లో ఉందని, ఆ భూమి పోతున్నా కాపాడుకోలేరా? అని ప్రశ్నించారు. 

విలువైన భూమిని కొట్టేస్తుంటే.. అధికారులు లంచాల కోసం సహకరిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. పోలీసుల ఆస్తి కోసం తాము పోరాటం చేస్తుంటే.. తిరిగి తమపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.


More Telugu News