టీవీలో చానళ్లు చూసేందుకు త్వరలో మరింత సమర్పించుకోవాల్సిందే

  • కొత్తగా అమల్లోకి టారిఫ్ ఆర్డర్ 3.0
  • ఇది అమలు చేస్తే తమపై భారం పడుతుందంటున్న డీటీహెచ్ పరిశ్రమ
  • నెలవారీగా రూ.25-50 వరకు పెరిగే అవకాశం
డీటీహెచ్ టారిఫ్ లకు త్వరలో రెక్కలు రానున్నాయి. దేశ టెలివిజన్ చానళ్ల ప్రసారాల పంపిణీలో డీటీహెచ్ సంస్థలకు గణనీయమైన మార్కెట్ వాటా ఉంది. కనుక ఇవి ధరలు పెంచితే ఎక్కువ మంది వినియోగదార్లపై ప్రభావం తప్పకుండా పడుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కంటెంట్ చూస్తున్నారు. దీంతో డిటీహెచ్ సంస్థలు ఓటీటీ సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. 

ఇప్పుడు డీటీహెచ్ సంస్థలు ట్రాయ్ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ 3.0ను అమలు చేయాల్సి వచ్చింది. దీన్ని డీటీహెచ్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. అమలు చేస్తే తాము పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నాయి. ఇప్పటికే వినోద పరిశ్రమను ఓటీటీలు శాసిస్తున్నాయని, ఈ క్రమంలో కొత్త ఆదేశాలు డీటీహెచ్ పరిశ్రమపై మరింత ప్రభావం చూపిస్తాయని అంటున్నాయి. అయినప్పటికీ, వీటి ఆవేదన వినేవారు లేకుండా పోయారు. దీంతో తమపై పడే భారాన్ని ఇవి వినియోగదారులకు బదిలీ చేయనున్నాయి. ఒకే విడత కాకుండా దశలవారీగా రేట్లను పెంచొచ్చని అంచనా. వచ్చే కొన్ని వారాల్లో నెలవారీ టారిఫ్ లు రూ.25-50 మధ్య  పెరగొచ్చని తెలుస్తోంది. నాలుగైదు వారాల్లో పెంపు ఉంటుందని టాటాప్లే అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.


More Telugu News