రంగంలోకి దిగిన గూగుల్.. ‘చాట్‌జీపీటీ’కి పోటీగా ‘బార్డ్’

  • మైక్రోసాఫ్ట్‌కు పోటీగా రంగంలోకి దిగిన గూగుల్
  • బార్డ్‌ చాట్‌బాట్‌తో చాట్‌జీపీటీకి సవాల్
  • ప్రస్తుతం పరీక్షల దశలో బార్డ్
  • త్వరలో అందరికీ అందుబాటులోకి తెస్తామన్న ఆల్ఫాబెట్
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీకి పోటీగా మరో చాట్‌బాట్ ‘బార్డ్’ను రంగంలోకి దింపనున్నట్టు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సోమవారం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘చాట్‌జీపీటీ’కి సవాలు విసురుతూ గూగుల్ ఈ చాట్‌బాట్‌ను రంగంలోకి దించింది. ప్రస్తుతం ‘బార్డ్’ను కొద్ది మంది వినియోగదారుల సాయంతో పరీక్షిస్తున్నామని సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది. గూగుల్‌కు చెందిన లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ ఆధారంగా నడిచే ఈ చాట్‌బాట్.. మైక్రోసాఫ్ట్ రూపొందించిన చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వనుంది. 

ప్రముఖ వార్తాసంస్థ సీఎన్‌బీసీ కథనం ప్రకారం.. చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ ‘కోడ్ రెడ్’ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కొంతకాలంగా బార్డ్‌కు సంబంధించి పలు ఫీచర్లను ఉద్యోగుల సాయంతో పరీక్షిస్తోంది. సంక్లిష్ట సమాచారాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలా బార్డ్ వివరిస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు సంబంధించిన వివరాలను తొమ్మిదేళ్ల బాలబాలికలు అర్థం చేసుకునే రీతిలో సరళీకరించగలదని చెప్పారు. 

ఇప్పటివరకూ గూగుల్ సెర్చ్ ఆల్గోరిథమ్.. నెట్టింట్లో వినియోగదారులు కోరిన సమాచారాన్ని క్షణాల్లో ముందుంచుతూ మార్కెట్ లీడర్‌గా ఉంది. గూగుల్ సంస్థ తన సెర్చ్ ఆల్గోరిథమ్‌ను కృత్రిమ మేథ రంగంలో అగ్రగామిగా అభివర్ణించింది. అయితే.. చాట్‌జీపీటీ రాకతో గూగుల్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. కేవలం సమాచారం సేకరించి ఇవ్వడమే కాకుండా సంక్లిష్ట అంశాలను కూడా సులభమైన భాషలో వివరిస్తున్న చాట్‌జీపీటీ..  గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను వెనక్కు నెట్టేస్తుందన్న విశ్లేషణలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. 



More Telugu News