3,800కు చేరిన టర్కీ భూకంప మృతుల సంఖ్య... భారత్ నుంచి తరలివెళ్లిన తొలి విడత సహాయ సామగ్రి

  • వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిన టర్కీ, సిరియా
  • శ్మశానాలను తలపిస్తున్న భూకంప ప్రభావిత ప్రాంతాలు
  • శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆర్తనాదాలతో హృదయవిదారకం
  • బాధితులతో నిండిపోయిన ఆసుపత్రులు
  • రోడ్లపైనే పడిగాపులు పడుతున్న జనం
టర్కీ, సిరియాల్లో నిన్న సంభవించిన భారీ భూకంపాలు వందలాదిమందిని బలితీసుకున్నాయి. మరెంతోమంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం విలవిల్లాడుతున్నారు. ఈ భూకంపాల కారణంగా టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 3,800 మందికిపైగా మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాదిమందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. భూకంపం తర్వాత దాదాపు 50కిపైగా శక్తిమంతమైన ప్రకంపనలు టర్కీ, సిరియాలను కుదిపేశాయి.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోయాయి. శిథిలాల కింద నలిగిపోయిన వారి ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు హృదయవిదారకంగా మారాయి. ఆ ప్రాంతాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియక జనం రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక్క టర్కీలోనే దాదాపు 11 వేల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 2,470 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. చాలామంది స్థానికంగా ఉన్న మసీదుల్లో తలదాచుకుంటున్నారు. 

మరోవైపు, సిరియాలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో సంభవించిన భూకంపం కారణంగా 539 మంది ప్రాణాలు కోల్పోయారు. 1300 మందికిపైగా గాయపడ్డారు. అలాగే, తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 380 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 

భారీ భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా 45 దేశాలు ముందుకొచ్చాయి. భారత్ నుంచి ఇప్పటికే తొలి విడత సహాయ సామగ్రి టర్కీకి తరలివెళ్లింది. అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్ తదితర దేశాలతోపాటు నాటో, ఈయూ కూడా టర్కీ, సిరియాకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి.


More Telugu News