టర్కీ, సిరియా దేశాల్లో భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి... ఎన్డీఆర్ఎఫ్ బృందాల తరలింపు

  • టర్కీ, సిరియాల్లో భూకంపంతో భారీ విధ్వంసం
  • 1600 మందికి పైగా మృతి.. వేలల్లో క్షతగాత్రులు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ
టర్కీ, సిరియా దేశాల్లో తెల్లవారకముందే సంభవించిన భూకంపం వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. గాజియాన్ తెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉండగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ మధ్యాహ్నం మరోసారి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీ, సిరియా దేశాల్లో అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా 1600 మందికిపైగా మరణించారు. 

కాగా, టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం చాచారు. 

మోదీ ప్రకటన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.


More Telugu News