అస్సాంలో కొనసాగుతున్న భర్తల అరెస్టుల పర్వం.. కారణం ఇదే!

  • బాల్య వివాహాలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం
  • 18 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకున్న  పురుషులపై కేసులు
  • మూడు రోజుల్లో 2200 మందికి పైగా అరెస్ట్
అస్సాం రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఒకే రకమైన కేసులో మూడు రోజుల్లో 2200 మందికి పైగా అరెస్టయ్యారు. చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న పురుషులపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 4,074 కేసులు నమోదయ్యాయి. బాల్యవివాహాలు చేసుకున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీనిపై రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు వరుసగా మూడో రోజూ అరెస్టులు కొసాగించారు. అదివారం వరకు 2,273 మంది  ఇలాంటి కేసుల్లో కటకటాల పాలయ్యారు. అరెస్టయిన వారి కోసం మహిళలు, బంధువులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల వద్ద నిరసన చేపడుతున్నారు. 

అస్సాంలో బాల్య వివాహాలు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద, 14 ఏళ్ల లోపు బాలికలను చేసుకున్న వారిని 'సెక్సువల్ నేరాల నుంచి బాలలను పరిరక్షించే చట్టం' కింద ఆరెస్టు చేయాలని కొద్ది రోజుల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ వివాహాలను చట్ట ప్రకారం చెల్లనివిగా ప్రకటించింది. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులు నాన్ బెయిలబుల్ కేసులు ఎదుర్కుంటారని సీఎం హిమంత తెలిపారు. బాల్య వివాహాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు హిమంత చర్యలపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా ముస్లిం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ కేసులో భర్తలు అరెస్ట్ అయితే వారి భార్యల పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు.


More Telugu News