బంగ్లాదేశ్‌లో చెలరేగిపోయిన దుండగులు.. 12 హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం

  • 14 దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
  • ఆలయాలను పరిశీలించిన హిందూ నేతలు
ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో దుండగులు మరోమారు చెలరేగిపోయారు. ఉత్తర ఠాకూర్‌గావ్ జిల్లాలోని బలియాడంగీ ఉప జిల్లా పరిధిలో 12 హిందూ ఆలయాలపై దాడిచేసి 14 దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్ల పరిధిలో ఈ ఆలయాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆలయాలు రోడ్డు పక్కనే ఉండడంతో దుండగులు సులభంగా దాడి చేయగలిగారని పేర్కొన్నారు. 

ఈ ఘటనలన్నీ గత రాత్రి జరిగినట్టు తెలిపారు. ధ్వంసమైన ఆలయాలను డిప్యూటీ పోలీస్ కమిషనర్, ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్థానిక హిందూ నేతలతో మాట్లాడుతూ.. భయపడాల్సిన అవసరం లేదని, ఆలయాలకు మరింత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని వివరించారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాలను పరిశీలించిన చరుల్ యూనియన్ పరిషత్ చైర్మన్ దిలీప్ కుమార్ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఇక్కడి ఆలయాల్లో దాదాపు 50 ఏళ్లుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు దంతాల యూనియన్ పూజా ఉజ్జపోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జోతిర్మయి సింగ్ తెలిపారు. 

ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహబూబుర్ రెహ్మాన్ హామీ ఇచ్చారు. 



More Telugu News