భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

  • విదేశాల్లోని అమెరికా ఎంబసీల్లో వీసా అపాయింట్‌మెంట్లు
  • వీసా వెయిటింగ్ టైం తగ్గించేందుకు అమెరికా చర్యలు
  • బ్యాంకాక్‌లో భారతీయులకు బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్స్
అమెరికా వీసా కోసం ప్రస్తుతం భారతీయులు 500 రోజులకు పైగానే ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన అమెరికా.. తాజాగా భారతీయులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ పర్యటనలకు వెళ్లే వారు అక్కడి అమెరికా దౌత్యకార్యాలయాల్లోనూ వీసా అపాయింట్‌మెంట్ పొందచ్చని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘‘మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నారా..? అయితే..అక్కడి ఎంబసీ లేదా కాన్సూలేట్‌లో వీసా అపాయింట్‌మెంట్ పొందొచ్చు. ఉదాహరణకు బ్యాంకాక్‌లోని యూఎస్ ఎంబసీ బీ1/బీ2 అపాయింట్‌మెంట్ స్లాట్లను భారతీయులకు అందుబాటులో ఉంచింది.’’ అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. 

వీసా దరఖాస్తుల పరిశీలనా వ్యవధిని కుదించేందుకు అమెరికా ఇటీవలకాలంలో పలు చర్యలు చేపట్టింది. తొలిసారి దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు అనుమతివ్వడం, కాన్సులేట్లలో సిబ్బంది సంఖ్యను పెంచడం తదితర చర్యలు తీసుకుంది. వీసా బ్యాక్‌లాగ్‌లను తగ్గించేందుకు జనవరి 21న ఢిల్లీలోని అమెరికా ఎంబసీతో పాటూ ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాల్లోని కాన్సూలార్ కార్యాలయాలు ‘‘స్పెషల్ సాటర్‌డే ఇంటర్వ్యూ డేస్‘ పేరిట ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. అంతేకాకుండా.. గతంలో అమెరికా వీసా పొందిన వారికి ఇంటర్వ్యూ రద్దు దరఖాస్తుల పరిశీలనను కూడా అమెరికా వేగవంతం చేసింది.    



More Telugu News