సజ్జల మాటలు సిగ్గుచేటు: టీడీపీ నేత జీవీ రెడ్డి

  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను విచారించిన సీబీఐ
  • ఈ కేసులో ఉన్న పెద్దలెవరో త్వరలో తేలుతుందన్న జీవీ రెడ్డి
  • సజ్జల మాటలు సిగ్గుచేటని విమర్శలు 
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న పెద్దలెవరో త్వరలోనే తేలుతుందని టీడీపీ నేత జీవీ రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించిన నేపథ్యంలో జీవీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

వివేకా హత్య జరిగిన రోజు ఎంపీ అవినాశ్ రెడ్డి తన ఫోన్ నుంచి భారతి రెడ్డి పీఏ నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేశారని సీబీఐ విచారణలో తేలిందని అన్నారు. ఇందులో తప్పేముందని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని జీవీ రెడ్డి విమర్శించారు. అందులో తప్పు ఉందో లేదో సీబీఐ తేల్చుతుంది, దానిపై మాట్లాడటానికి సజ్జల ఎవరు? అంటూ ప్రశ్నించారు. 

వివేకానంద రెడ్డి హత్య జరిగి 4 ఏళ్లు కావస్తోంది. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు జగన్ కుటుంబసభ్యుల తీరు అనుమానాస్పదంగానే ఉంది. హత్య జరిగిన నాడు చంద్రబాబు, టీడీపీ నేతలే చంపారంటూ ఆరోపణలు చేశారు. తర్వాత ఆస్తి కోసం వివేకా కూతురు, అల్లుడే హత్య చేశారని కథలు అల్లారు. చివరకు అక్రమ సంబంధమే వివేకా హత్యకు కారణమంటూ మరో కథ అల్లి ఆయన వ్యక్తిత్వంపై ఆరోపణలు చేశారు. కొన్ని రోజులకు వివేకా హత్య  వైయస్ కుటుంబ సభ్యుల పనేనని ప్రజలకు తెలిశాక, దానిపై ఎవరూ మాట్లాడకూడదంటూ 2019 మార్చి 29న కోర్టు నుంచి గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక సిట్ వేసి విచారణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే  వివేకా హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్ 2న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత వివేకానందరెడ్డి శవానికి కుట్లు వేసిన ఆస్పత్రి ఎండీ ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు. ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. అందుకే వివేకా కూతురు సునీత  హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరింది. 

కానీ సీబీఐ విచారణకు సహకరించకుండా సీబీఐ అధికారుల్ని సైతం బెదిరించారు. వివేకా హత్యకు ముందే అన్ని విషయాలు జగన్ కి తెలుసు. వివేకాను ఎవరు చంపబోతున్నారో, ఎలా చంపబోతున్నారో కూడా తెలుసు. కానీ రాజకీయ లబ్డి కోసమే నాడు టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు వివేకా హత్య కేసులో అసలు నిందితులు సొంత కుటుంబ సభ్యులేనని సీబీఐ విచారణలో తేలుతోంది. నాడు నారాసుర రక్తచరిత్ర అంటూ రాసిన తప్పుడు  రాతలకు నేడు ఏం సమాధానం చెబుతారు?" అంటూ జీవీ రెడ్డి వైసీపీ నేతల్ని నిలదీశారు.


More Telugu News