ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

  • చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి
  • తెలుగుతోపాటు 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం 
  • ఇటీవలే కేంద్రం ప్రభుత్వ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక
 సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం.

కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి.. తన ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. నాటి మద్రాస్ క్వీన్స్ మేరీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తెలుగుతోపాటు దాదాపు 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. కె.వి.మహదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాధన్‌, ఇళయరాజా, పెండ్యాల, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. మూడు జాతీయ పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్‌ అవార్డును ప్రకటించింది. అవార్డును అందుకోకముందే ఆమె మరణించారు.


More Telugu News