సిక్కు సైనికులకు హెల్మెట్లు... వ్యతిరేకించిన గురుద్వారా ప్రబంధక్ కమిటీ

  • జాతీయ మైనారిటీ కమిషన్‌తో ప్రబంధక్ కమిటీ బృందం సమావేశం
  • ‘బాలిస్టిక్ హెల్మెట్’ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం
  • సిక్కు అస్తిత్వపరమైన అంశాల్లో జోక్యం సహించబోమని స్పష్టీకరణ
సిక్కు సైనికులకు బాలిస్టిక్ హెల్మెట్లు(యుద్ధరంగంలో ధరించే ప్రత్యేక హెల్మెట్లు) ఇవ్వాలన్న ప్రతిపాదనను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. శుక్రవారం ఎస్‌జీపీసీ బృందం ఒకటి న్యూఢిల్లీలో జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురాతో సమావేశమైంది. 

ఎస్‌జీపీసీ జనరల్ సెక్రెటరీ గురుచరణ్ సింగ్ గ్రెవాల్‌తో పాటు కమిటీ సభ్యులు రఘుబీర్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్మెట్ల ప్రతిపాదనపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిక్కు అస్తిత్వపరమైన అంశాల్లో జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో చర్చించాల్సిందేమీ లేదని కూడా కుండబద్దలు కొట్టారు. 

సిక్కు సైనికులకు బాలిస్టిక్ హెల్మెట్లు అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ లేవనెత్తిన అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


More Telugu News