తెలంగాణలో గ్రూప్-4కు భారీ డిమాండ్.. 9.5 లక్షల దరఖాస్తులు

  • ముగిసిన దరఖాస్తు ప్రక్రియ
  • 8,180 ఖాళీలు.. ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ 
  • జులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ డిమాండ్ నెలకొంది. మొత్తం 8,180 ఖాళీలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 2 వరకూ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. టీఎస్పీఎస్సీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 30తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు. జనవరి 30న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల సంఖ్య 8,47,277కి చేరగా.. ఫిబ్రవరి 3 నాటికి దాదాపు మరో లక్ష మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ లెక్కన గ్రూప్-4లో ఒక్కో పోస్టుకు 116 మంది పోటీపడుతున్నారు. కాగా, గ్రూప్-4 పరీక్షను జులై 1వ తేదీన నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఇక, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వార్డెన్లు, మాట్రిన్, సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు గడువు కూడా ముగియగా 581 పోస్టులకు 1,45,358 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 250 మంది పోటీ పడుతున్నారు. ఈ పరీక్ష ఆగస్టు నెలలో ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.


More Telugu News