‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే నవాజ్‌బాషా.. మదనపల్లెలో ఉద్రిక్తత

  • 32వ వార్డులో కార్యక్రమం
  • సమస్యను వివరిస్తూ ఎమ్మెల్యే చేయిపట్టుకున్న స్థానికుడు
  • ఆగ్రహంతో చేయి చేసుకున్నట్టు చెబుతున్న స్థానికులు
  • బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నవాజ్‌బాషా స్థానికుడిపై చేయి చేసుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. నీరుగట్టువారిపల్లెలో జరిగిందీ ఘటన. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపల్లెలోని 32వ వార్డులో గత రాత్రి ‘గడపగడపకు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా రామిరెడ్డి లేఅవుట్ వినాయకుని వీధిలో నివాసముంటున్న లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చి, ఆయన భుజంపై చేయివేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

తన ఇంటి ముందున్న రోడ్డును మరమ్మతు చేయించాలని ఎమ్మెల్యేను లక్ష్మీనారాయణ కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. ప్రస్తుతమున్న రోడ్డుపైనే రోడ్డు వేయించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అయితే, అలా చేస్తే రోడ్డు ఎత్తు పెరిగి ఇల్లు కిందికి అయిపోతుందని లక్ష్మీనారాయణ ఆయనకు వివరిస్తూ చేయి పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆయనపై చేయి చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసి స్థానికులందరూ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ ఘటన జరిగిన క్షణాల్లోపే పోలీసులు లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానికులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లక్ష్మీనారాయణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగి ఒకరినొకరు తోసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారిని పిలిపించి సమస్యను వివరించడంతో గొడవ సద్దుమణిగింది.


More Telugu News