అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై నిర్మలా సీతారామన్ స్పందన

  • అదానీ వ్యాపారాలపై హిండెన్ బర్గ్ బండ
  • తీవ్ర నష్టాల్లో అదానీ గ్రూప్ సంస్థలు
  • రుణభారం లక్షల కోట్లలో ఉందన్న హిండెన్ బర్గ్
  • భారీగా పతనమైన అదానీ సంపద
  • అదానీలో ఎస్బీఐ, ఎల్ఐసీ పెట్టుబడులపై అనిశ్చితి!
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అదానీ వ్యాపార సామ్రాజ్యానికి అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అత్యంత ప్రతికూలంగా పరిణమించింది. అదానీ వ్యాపార లావాదేవీలన్నీ గాలిబుడగ తీరును తలపిస్తున్నాయని హిండెన్ బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక వచ్చిన కొన్నిరోజుల్లో అదానీ గ్రూప్ సంస్థలకు స్టాక్ మార్కెట్లలో చుక్కెదురైంది. షేర్లు భారీగా పతనం అయ్యాయి. 

అదానీ సంస్థల్లో భారత ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో, ఆయా షేర్ల పరిస్థితిపై అనిశ్చితి ఏర్పడింది. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థల నియంత్రణ సజావుగానే సాగుతోందని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఇలాంటి ఒక్క ఘటన భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సూచిక కాబోదని స్పష్టం చేశారు. 

అదానీ సంస్థల్లో ఎస్బీఐ, ఎల్ఐసీ పెట్టుబడులు పరిమితికి లోబడి ఉన్నాయని, ఆయా షేర్ల విలువ పడిపోయినప్పటికీ లాభాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదని నిర్మలా సీతారామన్ వివరించారు. ఆ మేరకు తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు. 

ఇప్పటికే ఎస్బీఐ, ఎల్ఐసీ తాజా పరిణామాలపై వివరణాత్మకంగా స్పందించాయని వెల్లడించారు. భారత బ్యాంకింగ్ సెక్టార్ ప్రస్తుతం ఘనమైన రీతిలో చాలా సౌకర్యవంతమైన స్థాయిలో ఉందని వివరించారు.


More Telugu News