తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది: గవర్నర్ తమిళిసై

  • అసెంబ్లీలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
  • ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం
  • అభివృద్ధిలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి దేశమంతా ఆశ్చర్యపోతోందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.

ఒకప్పుడు విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రం అంధకారంలో ఉండేదని తమిళిసై చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రస్తుతం 24 గంటల నిరంతర విద్యుత్ తో రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతోందని తెలిపారు. కుదేలయిన వ్యవసాయ రంగాన్ని తన ప్రభుత్వం ఆదర్శవంతంగా తీర్చిదిద్దిందని చెప్పారు. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిందని వివరించారు.

రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తొలగిపోయాయని, గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన జలాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని తమిళిసై తెలిపారు. తెలంగాణలోని గ్రామాల రూపురేఖలు నేడు మారిపోయాయని, జీవన ప్రమాణాలు పెరిగాయని గవర్నర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. ఐటీ రంగంలో మేటిగా పరుగులు పెడుతూ ప్రపంచ స్థాయి సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానంగా నిలుస్తోందని తెలిపారు.

పర్యావరణం, పచ్చదనం పెంపులో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోందని గవర్నర్ తమిళిసై చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు మాత్రమేనని, ప్రభుత్వ కృషితో 2021 నాటికి ఆదాయం రూ.1.84 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ మిగతా రాష్ట్రాలకంటే ముందు ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉందని, ఇప్పుడు రూ.3.17 లక్షలకు చేరిందని గవర్నర్ వివరించారు.


More Telugu News