కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకుంటే రిస్క్ అంచనా వేయొచ్చు!

  • అందరికీ ఒకటే సాధారణ స్థాయి వర్తించదు
  • కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే ముందుగా జాగ్రత్తపడాలి
  • 9 ఏళ్లు, 11 ఏళ్ల వయసులో లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష అవసరం అంటున్న అమెరికా వైద్యులు
20 ఏళ్లలో ఉన్న వారికి కొలెస్ట్రాల్ పరీక్ష ఎందుకు? అని అనుకోవచ్చు. కానీ, కొందరికి జన్యుపరంగా కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉంటే రిస్క్ అధికంగా ఉన్నట్టే భావించాలి. హానికారక కొలెస్ట్రాల్ ను ఎంత ముందుగా గుర్తించినట్టయితే నష్టాన్ని అంత ముందుగా నిలువరించడం సాధ్యపడుతుందని పెన్ స్టేట్ హెల్త్ మిల్టన్ ఎస్ హెర్షే మెడికల్ సెంటర్ కార్డియాలజిస్ట్ మైఖేల్ ఫార్బనిక్ అంటున్నారు. 9 ఏళ్ల వయసులో ఒకసారి, 11 ఏళ్ల వయసులో ఒకసారి పిల్లలకు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాలని, తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేయించుకోవడం మంచిదన్న సలహా కూడా ఉంది. 40 ఏళ్లు దాటిన తర్వాత తప్పకుండా ఏటా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కు వెళ్లాలన్నది వైద్యుల సూచన.

కొలెస్ట్రాల్ అన్నది ఒక వ్యాక్స్ లాంటి పదార్థం. లివర్ లో తయారవుతుంది. రక్తంలో, అన్ని కణాల్లో కనిపిస్తుంది. కణాల గోడల నిర్మాణానికి ఇది అవసరం. అలాగే, హార్మోన్ల తయారీ, కణాల రక్షణకు కూడా కావాల్సిందే. కండరాలు, కణాలకు శక్తిని పొందేందుకు వీలుగా ఎల్డీఎల్, హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ అందుతుంటుంది. టోటల్ కొలెస్ట్రాల్ 200కు లోపు ఉంటే సాధారణంగానే ఉందనుకుంటారు. కానీ, టోటల్ కొలెస్ట్రాల్ 200 ఉండి, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్ 25 ఉంటే, అప్పుడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 170 అవుతుందని, అది మంచిది కాదని మైఖేల్ ఫార్బనిక్ అంటున్నారు. 

ఎలాంటి రిస్క్ లు లేని వారికి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 130 ఎంజీ వరకు ఉంటే ఫర్వాలేదు కానీ, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్న వారికి ఇంత కూడా ఉండడం మంచిది కాదన్నది ఫార్బనిక్ హెచ్చరిక. కుటుంబంలో గుండె జబ్బులు, ఇతర ఆరోగ్యపరమైన రిస్క్ లు ఉన్నట్టయితే అప్పుడు ఎల్డీఎల్ 70ఎంజీ ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, ట్రై గ్లిజరైడ్స్ 150 ఎంజీలోపు ఉండాలని, 200కు పైన ఉంటే అది అధికంగా ఉన్నట్టు చెప్పారు. కనుక అందరికీ చెప్పే సాధారణ కొలెస్ట్రాల్ స్థాయులను చూడకుండా.. కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా వీటి సాధారణ స్థాయులు మారిపోతుంటాయని తెలిపారు. కుటుంబంలో ఈ తరహా రిస్క్ లు ఉన్న వారు వైద్యుల సూచన తీసుకోవడం అవసరం.


More Telugu News